ఈ ఆటోలో అన్నీ ఉన్నాయ్.. ఆనంద్ మహీంద్రా ఫిదా

Update: 2020-07-11 20:08 GMT

ఆటో నడుపుకునే ఆ వ్యక్తి ఎంత బాగా ఆలోచించాడు. ఆ చిన్న ఆటోలోనే అన్నీ సమకూర్చాడు. కరోనా నేపథ్యంలో మనతో పాటు మన చుట్టు పక్కల వాళ్లూ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాడు. జీవనాధారం కోసం తను నడుపుతున్న ఆటోలో ఎక్కే ప్రయాణీకుల క్షేమం ముఖ్యమని భావించాడు. ముంబయి చెందిన ఆటో డ్రైవర్ సత్యవాణ్ గైట్.. ఆటోలో ఓ పక్కన మొక్కలు, చిన్న సింక్, శానిటైజర్, వాటర్ ట్యాంక్, ఛార్జింగ్ పాయింట్, తాగేందుకు మంచినీళ్లు, డస్ట్ బిన్ అన్నీ అందులో ఏర్పాటు చేశాడు.

ఆటోకి వెలుపలి భాగంలో కరోనాకు సంబంధించిన బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ హెల్ప్ లైన్ నంబర్లు, మరాఠీ, ఆంగ్ల భాషల్లో ముద్రించాడు. కరోనాపై పోరాడుతున్న వారియర్స్ కు ధన్యవాదాలు తెలుపుతూ కొన్ని వాక్యాలు రాశాడు. అంతే కాదు సీనియర్ సిటిజన్లకు కిలోమీటర్ వరకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాడు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఆటోను తీర్చిదిద్దిన సత్యవాణ్.. మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాను ఆకర్షించారు. ట్విట్టర్ వేదికగా దీనికి సంబంధించిన వీడియోను ఆయన షేర్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. 30 వేల మందికి పైగా లైక్ చేయగా 3 లక్షల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు.

 

Similar News