ప్రభుత్వ వైద్యుడి నిర్వాకం.. భార్యకి కొవిడ్ ఉందని తెలిసి పనిమనిషికి..

Update: 2020-07-12 16:05 GMT

చేసిందే తప్పంటే ఆ తప్పుని కప్పి పుచ్చుకోవడానికి మరో తప్పు చేశాడు ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న ఓ వైద్యుడు. కరోనా లక్షణాలతో బాధపడుతున్న భార్య శాంపిల్స్ ని ఇంట్లో పని చేస్తున్న పనిమనిషి పేరిట పంపించాడు.. బుక్కైతే ఏంటి పరిస్థితి అని ఒక్క క్షణం కూడా ఆలోచించలేకపోయాడు. యధావిధిగా డ్యూటీ నిర్వహించాడు.. తానూ కొవిడ్ బారిన పడ్డాడు.. పోలీసుల చేతికి చిక్కాడు.

మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ పట్టణం సింగ్రౌలి ప్రాంతంలో ప్రభుత్వ వైద్యుడిగా పని చేస్తున్న ఓ వ్యక్తి ఇటీవల కుటుంబసభ్యులతో కలిసి ఉత్తరప్రదేశ్ లో జరిగిన తన బంధువుల ఇంట్లో పెళ్లికి హాజరయ్యాడు. జూన్ 23న పెళ్లికి వెళ్లి మళ్లీ తిరిగి జూలై 1న తన గ్రామానికి వచ్చాడు. కొవిడ్ నిబంధనలను తుంగలో తొక్కి హోం క్వారంటైన్ లో ఉండకుండా వెంటనే డ్యూటీలోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత భార్యలో కొవిడ్ లక్షణాలు కనిపించాయి. టెస్ట్ చేయిస్తే ఎక్కడ తన యూపీ వెళ్లి వచ్చిన విషయం బయటపడుతుందో అని భావించి ఓ ఐడియా ప్లాన్ చేశాడు.

తన భార్య శాంపిళ్లను ఇంట్లో పనిమనిషి పేరిట పంపించాడు. పరీక్షల్లో పాజిటివ్ అని రావడంతో అధికారులు పనిమనిషి ఇంటికి చేరుకుని విచారించారు. దాంతో వైద్యుడి మోసం బయటపడింది. అనంతరం కుటుంబసభ్యులందరికీ టెస్ట్ చేయగా వైద్యుడితో పాటు అందరూ కొవిడ్ బారిన పడినట్లు తెలిసింది. దీంతో వైద్యుడిపై ఎపిడమిక్ చట్టం కింద కేసు నమోదు చేశారు. అతడు ఆస్పత్రి నుంచి కోలుకుని తిరిగి రాగానే చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. వైద్యుడి కారణంగా 33 మంది వైద్య సిబ్బంది ఐసోలేషన్ లోకి వెళ్లాల్సి వచ్చింది.

Similar News