రాజస్థాన్ లో రాజకీయ హైడ్రామాకు తెరపడింది. మధ్యప్రదేశ్ లో లాగా రాజస్థాన్ లో కూలే అవకాశం ఉందనుకున్న కాంగ్రెస్ సర్కార్ ప్రస్తుతానికి గట్టెక్కినట్టే అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. సీఎం అశోక్ గెహ్లాట్ నివాసంలో జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశం (సీఎల్పీ) ముగిసింది. ముఖ్యమంత్రి గెహ్లాట్ కు మద్దతు ప్రకటిస్తూ సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. అయితే ఈ సమావేశానికి ఎంతమంది ఎమ్మెల్యేలు హాజరయ్యారనే విషయంపై క్లారిటీ లేదు కానీ.. 102 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారని సీఎం వర్గీయులు చెబుతున్నారు.
ఒకరిద్దరు ఎమ్మెల్యేలు అనారోగ్య కారణాల రీత్యా హాజరుకాలీకపోయారని అన్నారు. ఇదిలావుంటే తనకు 25 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని గత మూడు రోజుల కిందట పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆయనతో ఢిల్లీలో అజయ్ మాకెన్ , అలాగే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ చర్చలు జరిపారు. అనంతరం పార్టీ హైకమాండ్ తోనూ సచిన్ చర్చలు జరిపారు. దాంతో మెత్తబడిన సచిన్.. ప్రస్తుతానికి గెహ్లాట్ కు మద్దతు ఇవ్వడానికి సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది.