మరోనాలుగు రోజుల పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. జార్ఖండ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. రుతుపవనద్రోణి తూర్పుభాగం వాయువ్య బంగాళాఖాతం మీదుగా పయనిస్తోందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని.. దీంతో మంగళవారం, బుధవారం ఎక్కువ చోట్ల ఉరుములు, పిడుగులతో వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ అధికారులు తెలపారు. ఇక.. గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని.. 18, 19 తేదీల్లో దక్షిణకోస్తా, రాయలసీమలో ఓ మోస్తరు నుంచి భారీగా, ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతిభారీగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.