అమ్మ పర్సులోనో, నాన్న జేబులోనో డబ్బులు తీశాడంటే అర్థముంది. ఈ బాల చోరుడికి అది చాలా చిన్న పనేమో అందుకే ఏకంగా బ్యాంకుకే టెండరు పెట్టాడు. కేవలం 30 సెకన్లలో రూ.10 లక్షలు కాజేశాడంటే చోర కళలో ఎంత ప్రావీణ్యం సంపాదించి ఉండాలి. వినడానికే ఆశ్చర్యంగా ఉన్నా ఇది నమ్మలేని నిజం. మధ్యప్రదేశ్ లోని నీముచ్ జిల్లాలో జవాద్ ప్రాంతంలోని స్థానిక కో ఆపరేటివ్ బ్యాంకులో జరిగింది. ఉదయం 11 గంటల సమయంలో బ్యాంకు కస్టమర్లతో రద్దీగా ఉంది. అప్పుడు ప్రవేశించాడు 10 ఏళ్ల బాలుడు పిల్లిలా క్యాషియర్ ఉండే క్యూబిన్ లోకి ప్రవేశించాడు. కేవలం 30 సెకన్లలో తన పని పూర్తి చేసుకుని దర్జాగా బ్యాంకు నుంచి బయటకి వెళ్లి పోయాడు.
గేటు బయటకు వచ్చిన తరువాత పరిగెడుతున్న బాలుడిని చూసి సెక్యూరిటీ గార్డుకు అనుమానం వచ్చింది. వెంటనే తేరుకుని ఆ బాలుడిని పట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఆ దరిదాపుల్లో ఎక్కడా కనిపించకుండా మాయమైపోయాడు. ఈ తతంగమంతా సీసీటీవీలో నమోదవడంతో వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు అనుమానితుల్ని విచారిస్తున్నారు. దొంగల బృందం ముందు పక్కాగా ప్లాన్ చేసి ఆ తరువాత బాలుడిని రంగంలోకి దింపి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.