తిరుమలలో ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా దర్శనాలను నిర్వహించి భక్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదుపై జాతీయ మానవహక్కుల కమిషన్ స్పందించింది. తిరుమల దర్శన మార్పులపై ప్రభుత్వ వైఖరి, తీసుకోనున్న చర్యలపై ఎనిమిది వారాల్లోగా నివేదిక సమర్పించాలంటూ ప్రధాన కార్యదర్శిని NHRC ఆదేశించిందని వనపర్తి జిల్లా ఆత్మకూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వై తిప్పారెడ్డి తెలిపారు.
2005 లో అప్పటి టీటీడీ పాలకమండలి లఘు దర్శనం , శీఘ్ర దర్శనం, బ్రేక్ దర్శనం వంటి విధానాలను తీసుకువచ్చింది. ఇది ఆగమ శాస్త్ర నిబంధనలకు విరుద్ధమని దీనివల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ NHRC లో దాఖలైన పిటిషన్ లో పేర్కొన్నారు. దేవాదాయ చట్టం 142 ప్రకారం సమ్మతం కాదని ఈ నెల మూడున ఫిర్యాదు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన NHRC చైర్మన్ ఏపీ సీఎస్ కు నోటీసులు ఇచ్చారు.