వైఎస్ఆర్ చెప్పిన మాటలు జగన్ కు గుర్తులేవా? ప్రభుత్వాల తప్పులను మీడియా వెలికితీయాలని నాడు తండ్రి చెప్పిన మాటలను ఇప్పుడు సీఎంగా జగన్ ఎందుకు పెడచెవిన పెట్టారు. అసలు ఈ మాట జగన్ కు వైఎస్ఆర్ ఎందుకు చెప్పారు. అసలు ఆరోజు జగన్ కు వైఎస్ఆర్ ఆ మాటలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది.. ఈ వివరాలన్నీ వైఎస్ విజయమ్మ రాసిన 'నాలో నాతో వైఎస్ఆర్' పుస్తకంలోని 237వ పేజీలో ఉన్నాయి. తప్పును తప్పుగా.. ఒప్పును ఒప్పుగా చూపించాలన్న ఉద్దేశ్యంతో నాడు 'సాక్షి' ఆవిర్భవించిందని ఈ పేజీలో రాసుకొచ్చారు. ఆ సమయంలో వైఎస్ఆర్ కు జగన్ కు మధ్య జరిగిన ఒక ముచ్చటైన విషయాన్నీ ప్రస్తావించారు.
ప్రభుత్వం తప్పులు.. ఫెయిల్యూర్ మన 'సాక్షిలో రాయవచ్చా అని తండ్రిని అడిగారట జగన్.. దీనికి వైఎస్ఆర్ సమాధానమిస్తూ సాక్షిని ప్రజల మనసాక్షిగా తీర్చుదిద్దు అన్నారట.. ప్రభుత్వం తప్పులు.. సమాజంలోని లోపాలు వెలికితీస్తేనే కదా.. ఈ ప్రజల ప్రభుత్వం రివ్యూ చేసి న్యాయం చేయగలిగేది అని చెప్పారట. తండ్రి చెప్పిన ఈ సిద్ధాంతాలకు నేటికీ కట్టుబడి ఉన్నారని వైఎస్ విజయమ్మ తన పుస్తకంలో రాసుకొచ్చారు. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. సిస్టం ఫెయిల్యూర్ గురించి సాక్షిలో రాయొచ్చా అని నాడు అడిగిన జగన్ ఇప్పుడు జీవో 2430 ఎందుకు తెచ్చారు..?
2007 లో వైఎస్ఆర్ తీసుకొచ్చిన జీవో 938 లో మార్పులు చేసి జీవో 2430 ఎందుకు తీసుకువచ్చారు.. ప్రభుత్వ తప్పులపై ఎత్తిచూపే మీడియాపై ఆంక్షలు విధించడం సమంజసమేనా? జగన్ మనసాక్షి ఇందుకు ఒప్పుకుంటుందా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ప్రెస్ కౌన్సిల్ కూడా ఈ జీవోను తీవ్రంగా వ్యతిరేకించింది. tv5 వ్యవహారమే తీసుకోండి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తూనే tv5 పై అక్కసు వెళ్లగక్కారు జగన్.. సందర్భానుసారం పాలనలో లోపాలను ప్రశ్నిస్తే ఛానల్ ప్రసారాలను అడ్డుకున్నారు. తాజాగా tv5 యాజమాన్యంపైనా.. tv5 ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మూర్తిపైనా కేసులు పెట్టారు. సిఐడి విచారణ పేరుతో ఎలాంటి వేధింపులు సాగుతున్నాయో అందరికి తెలిసిందే.
సత్యం జయించడానికి ఒక ఛానల్ ఉండాలని నాడు సాక్షిని స్థాపించిన జగన్ నేడు వాస్తవ పరిస్థితులు ఉన్నది ఉన్నట్టు చూపిస్తున్న చానళ్ళు, పేపర్లు, సోషల్ మీడియా పోస్టులను ఎందుకు సహించలేకపోతున్నారు..? స్వయంగా మీడియా అధినేతగా ఉన్న జగన్ తాను విపక్షనేతగా ఉన్నప్పుడు అప్పటి టీడీపీ ప్రభుత్వంపై ఎలాంటి రాతలు రాయించారో ఎవరూ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజకీయంగా ఆ రెండు పార్టీల మధ్య శత్రుత్వం ఇక్కడ అప్రస్తుతం వాటి ఖండనలు ప్రతివిమర్శలు వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు.. కానీ వాస్తవాలు చూపిస్తున్న చానళ్ళు, పేపర్లపై పార్టీ ముద్ర వేసి వార్తా ప్రసారాలు అడ్డుకోవడం ఎంతవరకూ సమంజసం అనేదే ప్రశ్న. ప్రభుత్వం తప్పులు చేస్తే ఎత్తిచూపవచ్చు. సొంత పత్రికైనా సరే సాక్షిలో నిరభ్యంతరంగా రాయొచ్చని నాడు వైఎస్ఆర్ స్వయంగా జగన్ కు చెప్పారని విజయమ్మ స్పష్టం చేశారు. ఆనాటి తండ్రీ కొడుకుల సంబాషణకు తానే సాక్షినన్నారు.
కానీ నేడు జరుగుతున్నదేంటి? సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినవారిపై ప్రభుత్వం ఎలాంటి దాడి చేస్తోంది? రాజధానిగా అమరావతే ఉండాలంటూ ప్రజాపోరాటం ఎలా సాగుతోందో ఐదుకోట్ల ఆంధ్రులకు చూపించడం మీడియా తప్పా? ప్రభుత్వం నిర్ణయాలు కోర్టుల్లో ఎలా తిరస్కారానికి గురవుతున్నాయో చూపించడం మీడియా తప్పా? ఇళ్ల పట్టాల కోసం భూముల కొనుగోళ్లలో జరుగుతున్న అవినీతిని బయటపెట్టడం మీడియా చేస్తున్న తప్పా? కరోనాతో పోరాడుతున్న సమయంలో వారియర్స్ తరఫున మాట్లాడటం మీడియా తప్పా? ఇసుక కొరతతో నిర్మాణరంగం ఇబ్బందుల పాలై లక్షల మంది ఉపాధి లేక అల్లాడిన వైనం మీడియాలో ప్రసారం చేయడం తప్పా? ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వ వ్యవహార శైలి గాడి తప్పిన ప్రతి సందర్భంలో మీడియా వాటిలో లోపాలను బయటప్రపంచానికి తెలియజేస్తూనే ఉంది.
దివంగత వైఎస్ఆర్ చెప్పినట్టు.. ప్రభుత్వం తప్పులు.. సమాజంలో లోపాలు.. మీడియా వెలికితీస్తేనే కదా ఆ ప్రభుత్వానికి వాస్తవం ఏమిటో తెలిసి దానిపై రివ్యూ చేసే అవకాశం దొరికేది. అలాంటప్పుడు ఈ ప్రభుత్వం వాస్తవాలను చూపిస్తే ఎందుకు తట్టుకోలేకపోతుంది? నాడు వైఎస్ఆర్ కు జగన్ కు మధ్య జరిగిన సంబాషణను విజయమ్మ గుర్తుచేసిన నేపథ్యంలో జగన్ తండ్రి చెప్పిన మాటలను గుర్తుచేసుకుంటారా? 'నాలో నాతో వైఎస్ఆర్' పుస్తకంలోని 237వ పేజీని చదివాక తన వైఖరి మార్చుకుంటారా? అనేది చూడాలి.