దక్షిణ కాశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలోని అమ్షిపోరా గ్రామంలో శనివారం ఎన్‌కౌంటర్ జరిగింది. ఉదయం భద్రతా దళాలు జరిపిన కాల్పులలో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. శుక్రవారం సాయంత్రం అమ్షిపోరా లోయలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారని భద్రతా దళాలకు సమాచారం వచ్చింది. దాంతో కాశ్మీర్ పోలీసులు, ఆర్మీ 62 ఆర్ఆర్ , సిఆర్పిఎఫ్ సంయుక్త బృందం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. అయితే ఈ క్రమంలో ఉగ్రవాదులు ముందుగా భద్రతా దళాలపై
కాల్పులు ప్రారంభించారు. దాంతో ఇది ఎన్‌కౌంటర్ కు దారితీసింది. ఎన్‌కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్టు తెలుస్తోంది. ఇంకా సెర్చ్ ఆపరేషన్ జరుగుతున్నట్టు సమాచారం. కాశ్మీర్‌లో గత 24 గంటల్లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన రెండవ ఎన్‌కౌంటర్ ఇది. కాశ్మీర్ కుల్గం జిల్లాలో శుక్రవారం ఉదయం ముగ్గురు జైష్ ఉగ్రవాదులు హతమైన సంగతి తెలిసిందే.