ఆశలు కల్పిస్తున్న 'సీరమ్' కంపెనీ..

Update: 2020-07-20 12:47 GMT

ప్రపంచమంతా కరోనాకి వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తోంది. దాదాపు నాలుగు నెలల నుంచి బ్రతుకులు భారంగా గడుస్తున్నాయి. బయటకు వెళ్లలేక ఇంట్లో ఉండలేక.. ఎన్ని రోజులు ఇలా ఉండాలో తెలియక నరకయాతన అనుభవిస్తున్నారు సామాన్యుల నుంచి మాన్యుల వరకు. వ్యాక్సిన్ ట్రయల్స్ తుది దశకు వచ్చాయంటే కొంత ఊరట కలుగుతుంది. ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా అంచనా వేస్తోంది. ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరుపుకుంటున్న ఆస్టాజెనెకా ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్ పై పనిచేస్తున్నాం.

వచ్చే నెలలో మనుషులపై ప్రయోగాలు ప్రారంభిస్తామని డిసెంబర్ నాటికల్లా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకువస్తాం అని సంస్థ సీఈఓ అడార్ పూనావాలా పేర్కొన్నారు. అమెరికాకు చెందిన కొడాజెనిక్స్ తో కలిసి వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఈ వ్యాక్సిన్ లు భారత్ తో పాటు తక్కువ ఆదాయం ఉన్న దేశాల్లో లభిస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఏడు ఫార్మా సంస్థలు వ్యాక్సిన్ అభివృద్ధికి నిరంతరాయంగా కృషి చేస్తున్నాయి. వాస్తవానికి వైరస్ కు వ్యాక్సిన్ తీసుకురావడానికి కొన్ని ఏళ్ల సమయం పడుతుంది.

అలాంటిది నెలల వ్యవధిలో వ్యాక్సిన్ తీసుకువచ్చేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్నారు శాస్త్రవేత్తలు. కాగా, వ్యాక్సిన్ తయారీలో భారత్ బయోటెక్ ముందు వరుసలో ఉంది. ఐసీఎంఆర్, ఎన్ఐవీ వంటి సంస్థలతో కలిసి కోవాగ్జిన్ వ్యాక్సిన్ రూపకల్పన చేపట్టారు. ఏడు నెలల్లో వ్యాక్సిన్ ట్రయల్స్ పూర్తి చేసుకుని మార్కెట్లోకి తీసుకురావలని లక్ష్యంగా పెట్టుకుంది.

Similar News