వామ్మో.. ఆయన లేకుంటే ఇక అంతేనా?

Update: 2020-07-21 22:32 GMT

మొదటి తరం పారిశ్రామికవేత్త బజాజ్‌ ఫైనాన్స్‌ చైర్మన్‌ రాహుల్‌ బజాజ్‌ తన పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించారు. ఈ వార్తలతో మంగళవారం ఆరంభంలో జోరుమీదున్న బజాజ్‌ ఫైనాన్స్‌ ఒక్కసారిగా నీరసించింది. డే గరిష్టం (రూ.3519.50) నుంచి 8.5 శాతం క్షీణించి రూ.3218.65కు పడిపోయింది. ప్రస్తుతం నాలుగున్నర శాతం పైగా నష్టంతో రూ.3277 వద్ద షేర్‌ ట్రేడవుతోంది.

2020 ఆగస్టు 1 నుండి అమల్లోకి వచ్చే విధంగా కంపెనీ వైస్ చైర్మన్ సంజీవ్ బజాజ్‌ను నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా బోర్డు నియమించింది.1987లో బజాజ్‌ ఫైనాన్స్‌ ప్రారంభమైనప్పటి నుంచి రాహుల్‌ బజాజ్‌ చైర్మన్‌ పదవిలో ఉన్నారు. గత 5 దశాబ్దాలుగా ఈ గ్రూప్‌నకు వివిధ బాధ్యతల్లో ఆయన సేవలందించారు. వారసత్వ ప్రణాళికలో భాగంగా ఆయన తన పదవి నుంచి వైదొలగనున్నారు. అయినప్పటికీ రాహుల్‌ బజాజ్‌ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ నాన్‌ ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌గా కంపెనీకి సేవలు అందించనున్నారు. రాహుల్‌ బజాజ్‌ స్థానంలో కంపెనీ వైస్‌ చైర్మన్‌ సంజీవ్‌ బజాజ్‌ను నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా కంపెనీ బోర్డు నియమించింది. ఇప్పటికే కంపెనీకి వివిధ పదవుల్లో పనిచేస్తోన్న సంజీవ్‌ బజాజ్‌ కొత్త పదవిలోనూ తన మార్క్‌కు అనుగుణంగా వృద్ధి బాటను కొనసాగిస్తారని ఇండస్ట్రీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

జూన్‌ 30తో ముగిసిన తొలి త్రైమాసికంలో కంపెనీ స్టాండలోన్‌ నికరలాభం 2.4శాతం క్షీణించి రూ.869.5 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం 14.5శాతం వృద్ధితో రూ.6649.74 కోట్లుగా ఉంది. గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ.5807.76 కోట్లుగా ఉంది. కంపెనీ లోన్‌ బుక్‌ 76 శాతం క్షీణించి రూ.1.75 మిలియన్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే సమయంలో రూ.7.27 మిలియన్లుగా ఉంది.

Similar News