ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజ్యసభ చైర్మన్ మొత్తం 61మంది సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. పార్లమెంట్ సమావేశాలు జరగకుండా ప్రమాణస్వీకారోత్సవం జరగడం రాజ్యసభ చరిత్రలో ఇదే మొదటిసారి. అయితే, దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో 15 మంది కొత్త సభ్యులు హాజరుకావడం లేదు. టీఆర్ఎస్ సభ్యులు కేశవరావు, కేఆర్ సురేష్ రెడ్డి వర్షాకాల సమావేశాల సమయంలో ప్రమాణం చేయాలని వారిద్దరూ నిర్ణయించుకున్నారు.
అటు, కర్నాటకలో పెద్దల సభకు వెళ్తున్న మాజీ ప్రధాని దేవెగౌడ్, తమిళనాడు నుంచి డీఎంకే సభ్యుడు తిరుచ్చి శివ కూడా బుధవారం ప్రమాణస్వీకారం చేయడంలేదు. తృణముల్ కాంగ్రెస్ సభ్యులు కూడా హాజరుకావడంలేదని వెంకయ్యనాయుడుకి లేఖ రాశారు. ప్రమాణస్వీకారం కోసం ఢిల్లీకి వస్తున్న సభ్యులు, వారి వెంట వచ్చే ఒక అతిథి ముందే కరోనా పరీక్షలు చేయించుకోవాలని రాజ్యసభ సచివాలయం స్పష్టం చేసింది. ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని, మాస్కులు, ఫేస్ షీల్డ్‌లు, గ్లోవ్స్ వంటివి ధరించాలని సూచించింది.