ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తోంది. ఈ మహమ్మారి తట్టుకునే వ్యాక్సిన్ కోసం ప్రపంచమంతా ఆశగా ఎదురుచూస్తోంది. ఈ ఆశలను నిజం చేస్తూ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన కరోనా వైరస్ వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తున్నట్టు రెండు రోజుల కిందట ప్రకటించింది. ఇక, వ్యాక్సిన్ తయారీలో భారత్‌లోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌తో కలిసి పనిచేస్తున్న ఆక్స్‌ఫర్డ్.. నవంబరులో ఇక్కడ వ్యాక్సిన్ ఉత్పత్తి చేయనుంది.
నవంబర్ నాటికి కరోనా వ్యాక్సిన్ సిద్ధం కావొచ్చని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదార్ పూనావాలా విశ్వాసం వ్యక్తంచేశారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో ఆయన బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సిన్ తొలి దశ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని ఆయన సీఎంకు తెలిపారు.