అడ్డ గాడిదలా పెరిగావ్.. ఎన్ని సార్లు చెప్పినా వినవా.. ఇంట్లో ఏదో ఒక సమయంలో అమ్మ చేతిలో ఇలాంటి తిట్లు తినే ఉంటారు. తాజాగా ఆ గాడిదనే ఉదాహరణగా చూపిస్తూ ఓ జర్నలిస్ట్ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. కరోనా వైరస్ తో జనాలు చచ్చిపోతున్నారు. కనీసం మాస్క్ అయినా ధరించండి.. సామాజిక దూరం మాట ఎప్పుడో మర్చిపోయారు.. ప్రాణాలు పోకముందే కనీస ప్రమాణాలు పాటించండి అని ప్రభుత్వాలు మొత్తుకుంటున్నాయి. మాస్క్ ధరించనివారికి ఫైన్ లు, పనిష్మెంట్లు ఇస్తున్నాయి. అయినా జనంలో మార్పు రావట్లేదు.
జర్నలిస్ట్ ఇదే అంశాన్ని తీసుకుని మాస్క్ లేకుండా తిరుగుతున్న జనాలకు బుద్ది చెప్పాలని భావించాడు. ఈ క్రమంలోనే రోడ్డు మీద ఉన్న గాడిద మూతి దగ్గర మైక్ పెట్టి మాస్క్ ధరించకుండా రోడ్డు మీదకు ఎందుకు వచ్చావు అని అడుగుతాడు.. దానికి అదేం సమాధానం చెబుతుంది.. వెంటనే ఆ పక్కనే మాస్క్ లేకుండా వెడుతున్న ఓ మనిషిని ఆపి మాస్క్ పెట్టుకోకుండా బయటికి ఎందుకు వచ్చావు అని దాన్ని అడిగితే సమాధానం చెప్పట్లేదు ఎందుకు అని అడుగుతాడు.. దానికి ఆ వ్యక్తి అది గాడిద కద సార్ ఎలా చెప్తుంది అంటాడు.. అవునా అందుకేనా లాక్ డౌన్ సమయంలో మాస్క్ పెట్టుకోకుండా రోడ్డు మీద తిరుగుతుంది అని అంటాడు.
జర్నలిస్ట్ తనను గాడిదతో పోల్చాడని అర్థం చేసుకున్న ఆ వ్యక్తి అక్కడి నుంచి పలాయనం చిత్తగించాడు. ఇలానే మాస్క్ లేకుండా తిరుగుతున్న మరికొంత మందిని కూడా ప్రశ్నిస్తాడు.. ఈ వీడియోను అరుణ్ బోత్రా అనే ఐపీఎస్ అధికారి తన ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. లాక్ డౌన్ సమయంలో బెస్ట్ మీడియా ఇంటర్వ్యూ అని క్యాప్షన్ కూడా పెట్టారు. నెటిజన్లు సైతం జర్నలిస్టును ప్రశంసిస్తున్నారు.