దేశంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. నిత్యం పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ కరోనా మహమ్మారి నుంచి కోలుకుంటున్నవారి శాతం కూడా పెరుగుతుంది. అదే సమయంలో మరణాల రేటు కూడా తగ్గుతుండటం ఆశావహ దృక్పథాన్ని కలిగిస్తుంది. వరుసగా మూడో రోజు కూడా రికవరీ రేటు పెరిగింది. శుక్రవారం దేశవ్యాప్తంగా 34,602మంది వ్యాధినుంచి కోలుకున్నారు. దాంతో దేశంలో కరోనా రికవరీ రేటు 63.45కు చేరింది. మరణాల రేటు 2.38కి తగ్గిందని కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం ప్రకటించింది.
జనాభా పరంగా చూస్తే ప్రపంచంలో భారత్‌లోనే కరోనా వ్యాప్తి అతి తక్కువగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ పునరుద్ఘాటించారు. ప్రతి పది లక్షల మందిలో కేవలం 864మందే వ్యాధిబారిన పడుతున్నారని, అందులో కేవలం 24మంది మాత్రమే మృతి చెందుతున్నారని మంత్రి వెల్లడిచారు.
కాగా, గడిచిన 24గంటల్లో 49,310 కొత్త కేసులు నమోదయ్యాయి. 740 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం కేసుల సంఖ్య 12.87లక్షలకు చేరింది. దేశంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 30,601కి చేరింది.