చిత్తూరు జిల్లా కేవీపల్లె మండలం మహల్‌రాజుపల్లెకు చెందిన వీరదుల్లు నాగేశ్వరరావుకు ఇద్దరు కుమార్తెలు వెన్నెల ఇంటర్, చందన పదో తరగతి పాసయ్యారు. కుటుంబ పోషణకు వ్యవసాయమే ఆధారం అయిన నాగేశ్వరరావుకు, నేల సాగు చేసేందుకు ఎద్దులు లేవు.. కొనే స్థోమత లేదు.. దాంతో ఆ రైతుకు తన ఇద్దరు కూతుళ్లు కాడెద్దులుగా మారి తండ్రికి వ్యవసాయంలో సాయంగా నిలిచారు. ఆ యువతులిద్దరు కాడి లాగడంతో వెనుకనుంచి తండ్రి మేడిపట్టగా... తల్లి విత్తనాలు చల్లింది.. అయితే ఈ ఘటన చూసిన కొందరు యువకులు ఈ దృశ్యాన్ని చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. దాంతో వైరల్ గా మారింది. ఈ క్రమంలో సాటి మనుషుల కష్టాలపై చలించి, సాయం అందించే హీరో సోనూసూద్ ఈ వీడియో చూసి.. మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు.
పొలం దున్నుకునేందుకు ట్రాక్టర్ కొనిచ్చి ఆ రైతు కుటుంబానికి దన్నుగా నిలిచారు. ఆ రైతు కుటుంబానికి ట్రాక్టర్ కొని ఇవ్వబోతున్నట్టు ప్రకటించిన సోనూసూద్.. గంటల వ్యవధిలోనే రూ.8.5 లక్షల విలువైన సోనాలికా ట్రాక్టర్ నాగేశ్వరరావుకు కొనిచ్చారు. బెంగళూరు నుంచి వచ్చిన సోనూసూద్ ప్రతినిధులు ట్రాక్టర్‌తోపాటు వ్యవసాయ పరికరాలు.. ఖర్చులకు రూ.5వేల నగదు అందించారు.. దీంతో ఆ కుటుంబం చాలా సంతోషం వ్యక్తం చేసింది. కష్టాల్లో ఉన్న వారికి ఇంత పెద్ద సాయం కూడా చేస్తారా? అని వారు ఆశ్చర్యపోయారు. ఈ సందర్బంగా ఆయన దయార్థ్ర హృదాయానికి వారు కృతజ్ఞతలు తెలుపుతూ.. భావోద్వేగానికి లోనయ్యారు. సోనూసూద్‌కు జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. ఇక కాడిపట్టిన వెన్నెల ,చందనలు ఇకనుంచి తమ సొంత అన్నయ్య సోనుసూదే అని చెప్పారు. రైతులకు సాయం చేసిన సోనూపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.