ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు జరగనున్నాయి. జూలై 30 నుంచి మూడు రోజులపాటు శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు జరగనున్నాయి. జూలై 29న అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ప్రతిఏడాది శ్రావణ మాసంలో ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి రోజుల్లో ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. జూలై 30న పవిత్ర ప్రతిష్ట, జూలై 31న పవిత్ర సమర్పణ, ఆగస్టు 1న పూర్ణాహుతి నిర్వహిస్తారు.
కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో పవిత్రోత్సవాలను అర్చకులు ఏకాంతంగా నిర్వహించనున్నారు.
ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో.. యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలిసీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.