తమిళనాడులో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్ కేసులు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,881 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే కరోనా బారిన పడి 97 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో వైరస్ సోకిన వారి మొత్తం సంఖ్య 2,24,859కి చేరింది. కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 3,935కి చేరింది. కాగా, కరోనా నుంచి 1,83,956 మంది కోలుకున్నారని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
కరోనా మహమ్మారి కట్టడి చేయడానికి తమిళనాడు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ఆగస్టు 31 వరకు పొడిగించినట్లు సీఎం పళని స్వామి గురువారం తెలిపారు. అంతర్గ, అంతర రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులను కూడా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి ఆదివారం పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ అమలులో ఉంటుందని తెలిపారు.