కొవిడ్ కష్టాలు.. కోలుకున్నా తీరవా!!

Update: 2020-08-08 20:32 GMT

ఈ కరోనా ఏమోగాని ఎవరినీ వదిలిపెట్టేలా లేదు.. అందరికీ వస్తుందంట. మనకీ వచ్చిపోయిందో.. లేక వస్తుందో.. ఇలా మాట్లాడుకుంటున్నారు రోజూ ఏ నలుగురు కలిసినా. మరి రోజుకో కొత్త వార్త.. అదీ కరోనా గురించే వినిపిస్తోంది. ప్రపంచ ప్రజలందరినీ ఊపిరి ఆడనివ్వకుండా చేస్తున్న కొవిడ్ వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి మొదలు శాస్త్రవేత్తలకు సవాల్ విసురుతూనే ఉంది. తాజాగా మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. పాజిటివ్ వచ్చి క్వారంటైన్ లో ఉండో లేక ఆస్పత్రిలో ఉండో చికిత్స తీసుకుని కోలుకున్న వారిని దీర్ఘకాలం పాటు అనారోగ్య సమస్యలు వెంటాడే అవకాశం ఉందని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది.

త్వరగా అలసిపోవడం, శ్వాస సమస్యలతో పాటు మానసిక సమస్యలూ తలెత్తే అవకాశం ఉందని సైంటిస్టులు చెబుతున్నారు. కోలుకున్న వందమంది రోగులపై అధ్యయనం చేసిన బ్రిటన్ లీడ్స్ విశ్వవిద్యాలయం ఈ విషయాన్ని తేల్చి చెప్పింది. వంద మందిలో 72 మంది అలసటతో ఉన్నట్లు గుర్తించారు. అలాగే ఇంతకు ముందు శ్వాస సమస్యలు లేని వారికి కూడా ఆ తర్వాత కూడా ఆ సమస్య ఎదురవుతున్నట్లు కనుగొన్నారు. ఐసీయూలో ఉండి కోలుకున్నవారు తీవ్ర మనోవ్యాకులతతో బాధపడుతున్నట్లు తేల్చారు. ఈ అధ్యయనానికి భారత సంతతి శాస్త్రవేత్త మనోజ్ శివన్ నేతృత్వం వహించారు.

Similar News