కట్టుకథల సాక్షి తప్పుడు కథనాలపై లీగల్ నోటీసులు ఇస్తున్నా: కిలారు రాజేష్
ఐటీ శాఖ దర్యాప్తులో నాకు క్లీన్ చిట్ ఇచ్చారు; అయినా అవాస్తవాలు సాక్షిలో ప్రచురించి నాపై బురద చల్లుతున్నారు; సాక్షి అసత్యపు రాతలపై లీగల్‌గా ఫైట్ చేస్తా- టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కిలారు రాజేష్;
అక్రమాస్తుల క్విడ్ ప్రోకో పెట్టుబడులకి పుట్టిన విషపుత్రిక సాక్షిలో తనపై వేస్తున్న నిరాధార కథనాలపై న్యాయపరంగా పోరాడతానని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కిలారు రాజేష్ ప్రకటించారు. ఐటీ దర్యాప్తు పేరుతో తనపై సాక్షి బురద చల్లుతోందని, ఆ ఐటీ దర్యాప్తు అప్పుడే ముగిసిందని, తనకి క్లీన్ చిట్ ఇచ్చారని చెప్పుకొచ్చారు. టీడీపీలో బలోపేతం చేయడానికి పన్నెండేళ్లుగా వివిధ హోదాలలో పనిచేస్తున్నానని, కార్యకర్తల సంక్షేమానికి కృషి చేస్తున్న తనపై వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమ కేసులు బనాయించేందుకు అనేక ప్రయత్నాలు చేసిందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం కుట్రతో ఐటీ దాడులు చేయించిందన్నారు. ఐటీ విచారణలో భాగంగా ఐదు రోజులపాటు తనను, తన కుటుంబాన్ని ఎన్నో ఇబ్బందులకి గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై ఆరోపణలు రుజువు చేయలేక ఆనాడే ఐటీ శాఖ విచారణ ముగించి క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పారు. ఇదే తన చిత్తశుద్ధి, నిజాయితీకి నిదర్శనం అని పేర్కొన్నారు. తనకి సంబంధించిన ఆరు సంవత్సరాల ఐటీ రిటర్న్‌లను యధాతధంగా ఆమోదించిన ఐటీ శాఖ ఒక్క ఏడాది రిటర్న్‌లో తన పూర్వీకుల ఆస్తిని అమ్మిన దానిపై కేపిటల్ గెయిన్స్ పూర్తిగా కట్టలేదని తనకి నోటీసులు ఇచ్చారని తెలిపారు. అది వ్యవసాయ భూమి అని, దానికి కేపిటల్ గెయిన్స్ వర్తించదని తాను అప్పీల్ చేసుకున్నానని వివరించారు. దీనినే సాకుగా తీసుకుని అసెంబ్లీలో, బయట వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు, వారి సాక్షి పత్రికలో కథనాలు పూర్తిగా అవాస్తవాలని ఖండించారు. తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని వేల కోట్ల అవినీతికి పాల్పడిన జగన్ రెడ్డి సీబీఐ ఈడీ వేసీన 12 చార్జిషీట్ల కేసులు ఎదుర్కొంటూ ఎదుటివారిపై అవినీతి ఆరోపణలు చేయడం హాస్యాస్పదం అని అన్నారు. ఉద్యోగం, వ్యాపారం, కనీస చదువులేని జగన్ రెడ్డి ఆదాయం 2004లో రూ.2 లక్షలు మాత్రమేనని, నేడు లక్షల కోట్లకు అధిపతి ఎలా అయ్యాడో ఆ విజయరహస్యం ఏమిటో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన నుంచి టిడిపి నేతలపై చేస్తున్న ఆరోపణలపై కనీసం ఒక్క చార్జిషీట్ కూడా వేయలేకపోవడం వైసీపీవన్నీ తప్పుడు ఆరోపణలేనని తేటతెల్లం అయ్యాయన్నారు. టిడిపి రూ.6 లక్షల కోట్ల కుంభకోణాలకి పాల్పడిందని, అసత్య ఆరోపణలతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి, తరువాత రూ.2 వేల కోట్ల కుంభకోణం అని, మరోసారి రూ.143 కోట్ల అవినీతి అని, నేడు సాక్షి కథనంలో రూ.157 కోట్ల కుంభకోణం జరిగిందని అంటున్నారని, ఇందులో ఏది నిజమే సాక్షి యజమాని చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ సృష్టించిన ఈ స్కాములలో తాను కీలకపాత్ర పోషించారని ప్రచురించడం ముమ్మాటికీ తన పరువు ప్రతిష్టలని మంటగలిపేందుకు ఉద్దేశపూర్వకంగా ప్రచురించినదేనని స్పష్టం అవుతోందన్నారు. ఆదాయపు పన్ను దాడుల్లో గానీ, తరువాత ఐటీ శాఖ ఇచ్చిన నోటీసుల్లోగానీ తనకు ఏ వ్యవహారాల్లో కూడా సంబంధం లేదని తేల్చి ఆ ఫైల్‌ను క్లోజ్ చేసిందని, అయినా ఆదాయపన్నుశాఖ పేరుతో తనపై సాక్షి మీడియాలో పదేపదే విషప్రచారం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదాయ పన్నుశాఖ చేయని ఆరోపణలు, శాసనసభలో చేయని ఆరోపణలను చేసినట్లు అవాస్తవాలు ప్రచురించినందుకు సాక్షికి లీగల్ నోటీసులు పంపిస్తున్నానని ప్రకటనలో పేర్కొన్నారు.