CM Chandrababu : ప్రతి నియోజకవర్గంలో 100 నుంచి 300 పడకల ఆస్పత్రులు: సీఎం చంద్రబాబు
ప్రతీ నియోజకవర్గంలో 100 నుంచి 300 పడకల ఆస్పత్రులు, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలో గుండెజబ్బులు, డయాబెటిస్, హైపర్‌టెన్షన్, శ్వాసకోశ వ్యాధులు కొన్నిచోట్ల విస్తృతంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆహారపు అలవాట్ల వల్ల డయాబెటిస్ కొన్ని జిల్లాల్లో ఎక్కువగా ఉందని వైద్యం, ఆరోగ్యంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో సీఎం వివరించారు.
చెడు ఆహారపు అలవాట్ల వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. చాలా వ్యాధుల నివారణకు నియంత్రిత ఆహారపు అలవాట్లు అవసరమని సూచించారు. ‘నలుగురు సభ్యుల కుటుంబంలో నెలకు 600 గ్రాముల ఉప్పు, 2 లీటర్ల వంట నూనె, 3 కిలోల పంచదార వాడితే సరిపోతుంది. ఉప్పు, వంటనూనె, చక్కెర తగ్గిస్తే ఆరోగ్య సమస్యలు దరిచేరవు. రాష్ట్ర ప్రజలు ప్రతిరోజూ అరగంట వ్యాయామం చేయాలి’ అని సీఎం పిలుపునిచ్చారు.