Vijayawada: విజయవాడతో ఆందోళన కలిగిస్తున్న అతిసారం

డయేరియా లక్షణాలతో 9 మంది మృతి;

Update: 2024-06-01 02:45 GMT

 విజయవాడతో అతిసారం ఆందోళన కలిగిస్తోంది. కలుషిత జలాల కాటుకు 5 రోజుల వ్యవధిలోనే 8 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల మంది........ ఆస్పత్రుల పాలయ్యారు. నగరంలో డయేరియా వేగంగా విస్తరిస్తున్నా అడ్డుకట్ట వేయడంలో అధికార యంత్రాంగం విఫలమైంది. కాలుష్య ప్రభావిత ప్రాంతాల్లో కనీసం వైద్య శిబిరాలూ నిర్వహించడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు.

విజయవాడలో డయేరియా విజృంభిస్తోంది. అతిసారం బారిన పడి ఇప్పటికే... 8 మంది మృతి చెందినా వైద్యారోగ్య శాఖ మాత్రం మొద్దునిద్ర వీడటంలేదు. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో దాదాపు.... 250 మంది రక్తనమూనాలు సేకరించినట్లు అధికారులు చెబుతున్నా..ఇంతవరకూ ఒక్కదాని ఫలితాన్నీ ప్రకటించలేదు. మృతుల రక్తనమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించ లేదు. అతిసార వేగంగా విస్తరిస్తున్న VMC యంత్రాంగం కనీసం నియంత్రణ చర్యలు చేపట్టలేదని బాధితుల బంధువులు విమర్శిస్తున్నారు.

విజయవాడలోని మొగల్రాజపురంలో సరఫరా చేసిన నీటిలో నైట్రేట్లు మోతాదుకు మించి ఉన్నట్లు తేలింది. ఇక్కడ నీటిని క్లోరినేషన్‌ చేసిన వెంటనే సరఫరా చేశారని, అలా చేయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. బోర్లు వేసిన ప్రాంతాలు సైతం సురక్షితమైనవి కావని తేల్చారు. మరోవైపు నీటి నమూనాలను పరీక్షించాల్సిన ప్రాంతీయ, జిల్లా ప్రజారోగ్య ప్రయోగశాలలు, నీటి పరీక్షా కేంద్రాలు అస్తవ్యస్తంగా మారాయి. ఈ ప్రయోగశాలల్లో బోర్లు, చేతిపంపులు, బావులు, ఇతర చోట్ల సేకరించే నీటి నమూనాలను పరీక్షించి, లోపాలపై సంబంధిత విభాగాలను అప్రమత్తం చేయాలి. కానీ చాలాచోట్ల పరికరాలు పని చేయడం లేదు. పైప్‌లైన్లలో మురుగునీరు కలవడం వల్లే దుర్వాసనతో కూడిన నీరు సరఫరా అవుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.ఒకవైపు కళ్లముందే అతిసారం ప్రబలుతుంటే నీటి కాలుష్యం కాదంటూ వీఎంసీ కమిషనర్‌ కొట్టిపారేస్తున్నారు. ద్రవక్లోరిన్‌ కలపడం వల్ల నీరు పసుపు రంగులోకి మారిందని చెబుతున్నారు. వర్షాకాలంలో పరిస్థితి మరింతగా విషమించకముందే తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రామలింగేశ్వర్‌నగర్, కృష్ణలంక, రాణిగారితోట, క్రీస్తురాజపురం, సత్యనారాయణపురం, సీతారాంపురం, గుణదల, గంగిరెద్దులదిబ్బ, సింగ్‌నగర్‌ ప్రాంతాలకు కలుషిత నీటి ముప్పు పొంచి ఉందని పలువురు చెబుతున్నారు. 

Tags:    

Similar News