ACCIDENTS: తెలుగు రాష్ట్రాలను భయపెడుతున్న ప్రమాదాలు
వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు.. ఒకదాని నుంచి తేరుకోకముందే మరో విషాదం.. బయటికెళ్తే క్షేమంగా వస్తారా అన్న ఆందోళన
వరుస రోడ్డు ప్రమాదాలు తెలుగు రాష్ట్రాలను భయపెడుతున్నాయి. ఒక విషాదం నుంచి తేరుకోక ముందే మరో ఘోరం వెంటాడుతోంది. దీంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు క్షేమంగా ఇంటికి వస్తారా అనే నమ్మకం లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. కర్నూలు జరిగిన ఘోర విషాద ఘటన మర్చిపోకముందే మరో ఘోర ఘటన తెలుగు ప్రజలను తీవ్ర శోకంలో ముంచేసింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 21 మంది చనిపోయారు. నెత్తుటి రహదారి అనే ముద్ర పడిన హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి నంబర్ 163 పైనే ఈ ఘోర విషాదం చోటు చేసుకోవడం స్థానిక ప్రజలను ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ నుంచి కర్నాటకలోని బీజాపూర్ వరకు 365 కి.మీ ఉండే ఈ ఎన్హెచ్ 163 అంటేనే రక్తం మరిగిన రహదారి అనే పేరు పడిపోయింది. ఎక్కడ చూసినా గుంతలు, ఇరుకు రోడ్లు, మూల మలుపులతో ఆ రోడ్డుపై ప్రమాదాలతో ఈ రహదారి మృత్యువుకు కేరాఫ్ అడ్రస్ గా మారింది.
అతి వేగంతో రోజుకు 15 మంది...
ఇటీవల కర్నూలు బస్సు ప్రమాదం మరవకముందే తాజాగా తెలంగాణ రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలో బస్సు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 20 మందికిపై మరణించారు. రెండు ఘటనల్లోనూ ఓవర్ స్పీడ్ ప్రధాన కారణంగా ఉంది. డ్రైవర్ల అతివేగంతో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అతివేగంతో జరిగే మరణాలు ఎక్కువగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతటా హైవేలలో ప్రతిరోజూ సగటున 15 మంది అతివేగం కారణంగా మరణిస్తున్నారు. 2023లో మాత్రమే, రెండు రాష్ట్రాలలోని జాతీయ, రాష్ట్ర రహదారులపై 5,500 మంది అతివేగం సంబంధిత ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయారు. ఆందోళనకరమైన విషయం ఏంటంటే.. తెలుగు రాష్ట్రాల్లో జరిగే అన్ని రోడ్డు ప్రమాద మరణాలలో 30 శాతం కంటే ఎక్కువ అతివేగం కారణంగానే సంభవించాయి. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల జరుగుతున్న ప్రాణా నష్టానికి ఇది ఉదాహరణ. తెలంగాణలో 2020 నుంచి 2023 మధ్య అతివేగం వల్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 25,000 మందికి పైగా మరణించారు. అతివేగం వల్ల సంభవించే మరణాలలో రాష్ట్రం దేశంలో ఏడో స్థానంలో ఉంది. గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా వంటి పెద్ద రాష్ట్రాల కంటే ఇది ఎక్కువ. ఇటీవలి కాలంలో భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతూనే ఉన్నాయి. వీటిలో ప్రధానమైనవి అతి వేగం, మద్యం తాగి వాహనాలు నడపడం, రాంగ్ రూట్ డ్రైవింగ్ చేయడం రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణంగా మారుతోంది.
కేంద్ర గణాంకాల ప్రకారం...
రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం దేశంలో మరణాలు 1.48 లక్షల (2017) నుండి 1.68 లక్షల (2023)కు పెరిగాయి. ఇందులో దాదాపు 70 శాతం మరణాలు అతి వేగం వల్లే జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఇటువంటి ఉల్లంఘనల కారణంగా ప్రమాదాలు పెరిగాయి.
అది మృత్యు రహదారి
ఎన్ హెచ్163 పై జరుగుతున్న వరుస ప్రమాదాలు తీవ్ర కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఈ రహదారిపై జరిగిన ప్రమాదాల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. గతేడాది డిసెంబర్లో చేవెళ్ల మండలం ఆలూరు స్టేజివద్ద కూరగాయలు అమ్ముకునేవారిపై ఓ లారీ దూసుకెళ్లిన ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అంతకు ముందు సెప్టెంబర్ లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు ప్రాణాలు విడిచారు. ఈ ఏడాది జూన్ లో కేజీఆర్ గార్డెన్ సమీపంలో ఓ భారీ గుంతలో వాహనం బోల్తా పడి ఇద్దరు దుర్మరణం చెందారు. ఇలా నిత్యం ప్రాణాలను బలి తీసుకుంటున్న ఈ 163 జాతీయ రహదారి తెలుగు ప్రజల వెన్నులో వణుకుపుట్టిస్తోంది. చేవెళ్ల మండలం మీర్జాగూడ బస్సు ప్రమాదానికి ఎన్ హెచ్ 163 రహదారి దుస్థితే కారణం అని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి రోడ్డు విషయంలో అడుగడుగునా అలసత్వం, నిర్లక్ష్యం ఉందనే విమర్శలు వినిపిస్తోంది. ఈ రోడ్డును విస్తరించేందుకు 2018లో కేంద్రం నిర్ణయించింది. దాంతో అప్పటి వరకు ఆర్అండ్బీ అధికారుల ఆధీనంలో ఉన్న ఈ రోడ్డు హైవేగా ప్రకటించడంతో ఆర్అండ్బీ అధికారులు పక్కకు తప్పుకున్నారు. ఆ తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విస్తరణ కోసం భూసేకరణ విషయంలో పనులు ఆలస్యం అయ్యాయి. ఈ క్రమంలో రోడ్డు విస్తరణలో చెట్లకు నష్టం కలుగుతుందని పేర్కొంటూ పర్యావరణ ప్రేమికులు అడ్డుపడ్డారు. ఆ తర్వాత ప్రజాప్రతినిధుల చొరవతో ఈ అంశంలో పురోగతి చోటు చేసుకుంది. గత శుక్రవారమే(అక్టోబర్ 31) మొయినాబాద్-చేవెళ్ల రహదారి విస్తరణ పనులు ప్రారంభం అయ్యాయి. ఇంతలోనే ఈ ఘోటరం సంభవించి ఎందరి కుటుంబాల్లోనూ విషాదాన్ని నింపింది.