వివాదాస్పద వ్యాఖ్యలతో అరెస్టైన సినీ నటుడు, నిర్మాత పోసాని కృష్ణ మురళికి 14 రోజుల రిమాండ్ విధించింది రైల్వేకోడూరు కోర్టు. అర్ధరాత్రి 2:30 గంటల వరకు వాదనలు కొనసాగాయి. ఐదుగంటల పాటు ఇరుపక్షాల వాదనలు విన్నారు మెజిస్ట్రేట్. ఉదయం 5:30 గంటలకు తీర్పు వెలువరించారు జడ్జి. మార్చి 13 వరకు రిమాండ్ విధించారు మెజిస్ట్రేట్. రాజంపేట సబ్‌జైలుకు పోసాని కృష్ణమురళి తరలించారు.
పోసానిపై 14 కేసులు ఉన్నట్టు పోసానికే తెలియదనీ.. పోసానిపై లైఫ్ పనిష్మెంట్ సెక్షన్ 111 పెట్టారని పోసాని తరఫు అడ్వకేట్ పొన్నవోలు చెప్పారు. "111 సెక్షన్‌ను కోర్టు కొట్టివేసింది. ఐటీ యాక్ట్ కూడా వర్తించదని కోర్టు చెప్పింది. ఐదేళ్లలోపు శిక్షపడే సెక్షన్లకు.. రిమాండ్ విధించాల్సిన అవసరం లేదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిమాండ్‌కు పంపొద్దు. సుప్రీం తీర్పు ప్రకారం మేం వాదనలు చేశాం. కానీ మా వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు." అని పొన్నవోలు అన్నారు. రాజంపేట సబ్ జైలులో పోసాని కృష్ణ మురళికి 2261 నెంబర్ కేటాయించారు జైలు అధికారులు.