AMARAVATHI: ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలకు వేదికగా అమరావతి
రాజధానిలో ఏఐ ప్లస్ పేరుతో బిట్స్ పిలానీ క్యాంపస్....రూ.1000 కోట్లు పెట్టుబడి పెడతామన్న బిర్లా... 7000 మంది విద్యార్థులకు చోటు కల్పిస్తామని వెల్లడి;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలకు వేదికగా మారుతోంది. రాజధాని అమరావతి సిగలో మరో విద్యాకుసుమం విరియనుంది. ప్రఖ్యాత విద్యాసంస్థ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) తన క్యాంపస్‌ను రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. అమరావతిలో ఏఐ ప్లస్ క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్లు బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్-బిట్స్ విశ్వవిద్యాలయ కులపతి, పారిశ్రామికవేత్త కుమారమంగళం బిర్లా ప్రకటించారు. రూ.1,000 కోట్ల పెట్టుబడితో "ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్" పేరుతో అమరావతిలో కొత్త క్యాంపస్ నిర్మించనున్నట్టు స్పష్టం చేశారు. ఈ క్యాంపస్‌ను రెండు దశల్లో అభివృద్ధి చేస్తూ, మొత్తం 7,000 మంది విద్యార్థులకు చోటు కల్పించనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టును 2027 నాటికి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. అమరావతి క్యాంపస్‌ను ఆధునిక సాంకేతిక విద్యాకేంద్రంగా తీర్చిదిద్దుతామని బిర్లా తెలిపారు. కృత్రిమ మేథ, డేటాసైన్స్, రోబోటిక్స్, కంప్యుటేషనల్ లింగ్విస్టిక్స్, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ తదితర కోర్సులకు ప్రాధాన్యమిస్తామని వెల్లడించారు. స్మార్ట్, సుస్థిర మౌలిక సౌకర్యాలతో 2 దశల్లో 7000 మంది విద్యార్థులకు అవకాశం కల్పించేలా కేంద్రాన్ని రూపొందిస్తామన్నారు. 2027 నుంచి ప్రవేశాలు ప్రారంభిస్తామని కుమార మంగళం బిర్లా వెల్లడించారు. అమరావతిలో వచ్చే 5 ఏళ్లలో 1000 కోట్ల రూపాయల పెట్టుబడి పెడతామని ప్రకటించారు. అమరావతిలో బిట్స్ క్యాంపస్ ఉండాలనేది సీఎం చంద్రబాబు ఆలోచన అని బిర్లా వెల్లడించారు.
దేశంలోనే మొదటి ఏఐ క్యాంపస్
ఐవోటీ, ఏఐ ఆధారిత సేవలతో డిజిటల్ ఫస్ట్ క్యాంపస్ రూపుదిద్దుకుంటుందని దేశంలో ఇప్పటివరకు ఎక్కడా ఇలాంటి క్యాంపస్ లేదని ఆయన తెలిపారు. దేశంలో ఉన్నతవిద్య దిశను మార్చేందుకు తొలి అడుగుగా ఈ క్యాంపస్‌ను తీర్చిదిద్దుతామన్నారు. అమరావతిలో రెండేళ్లు, విదేశీ విశ్వవిద్యాలయాల్లో రెండేళ్లు అభ్యసించేలా డిజైన్ చేస్తున్నామని జాయింట్ పీహెచ్‌డీలు చేయొచ్చని బిర్లా వివరించారు. అమరావతి క్యాంపస్ దేశంలోనే మొదటి ఏఐ క్యాంపస్ కాబోతోందని కంప్యూటర్ సైన్సులోని అన్ని ముఖ్యమైన ప్రోగ్రామ్స్ అక్కడ ఉంటాయని ఉపకులపతి రామగోపాలరావు చెప్పారు. వివిధ మైనర్ ప్రోగ్రామ్స్‌ను అందుబాటులోకి తెస్తున్నామని అన్నారు. వ్యవసాయం నుంచి వాతావరణం, ఆరోగ్య సంరక్షణ వరకు అన్ని రంగాల కోర్సులకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. బిట్స్ అమరావతి క్యాంపస్ ఏర్పాటుకు సీఐర్డీఏ 70 ఎకరాలు కేటాయించింది. సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కన వేంకటేశ్వరస్వామి ఆలయ సమీపంలో స్థలం కావాలని బిట్స్ కోరింది. తమ సంస్థ భవనాలనూ ఆలయ నమూనాలో నిర్మిస్తామని తెలిపింది. దీంతో వారు కోరిన ప్రాంతంలోనే ప్రభుత్వం భూములు కేటాయించింది. ఇటీవల సీఎం చంద్రబాబు వద్ద కూడా దీనిపై చర్చ జరిగింది. బిట్స్ క్యాంపస్ నమూనాలను ఆయన పరిశీలించారు.