AMARAVATHI: మూడేళ్లలో అమరావతి తొలి దశ పూర్తి
ఏడు అంశాలకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం. 20 వేల ఎకరాల సమీకరణకు అంగీకారం;
మూడేళ్లలో అమరావతి కలను సాకారం చేసుకునే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రాజధాని నిర్మాణ పనులను వేగవంతం చేసే దిశగా చంద్రబాబు ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాజధాని పరిధిలో అదనంగా 20 వేల ఎకరాలకు పైగా భూమిని సమీకరించేందుకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ అథారిటీ ఆమోదం తెలిపింది. అమరావతి, తుళ్లూరు మండలాల్లోని ఏడు గ్రామాల్లో కలిపి మొత్తం 20 వేల 494 ఎకరాల భూమిని సమీకరించాలన్న ప్రతిపాదనకు అథారిటీ పచ్చజెండా ఊపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 50వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ఆర్సీపీ ఆధిపత్యం ఉన్న ఒకటి, రెండు గ్రామాల్లో కొంత గందరగోళముందన్న మంత్రి నారాయణ.. 5, 10 శాతం ఆమోదం లభించకపోవడం సహజమేనని తేల్చిచెప్పారు.
భూ కేటాయింపు ఇలా
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌కు 2 ఎకరాలు, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు 2 ఎకరాలు, స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్-5, ఏపీ కో ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్‌కు 0.495 ఎకరాలు, పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడెమీకి 12 ఎకరాలు, ఎంఎస్కే ప్రసాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడెమీకి 12 ఎకరాలు కేటాయిస్తూ సీఆర్డీఏ అథారిటీ అమోదం ఇచ్చింది. అలాగే ఆదాయపు పన్ను శాఖకు 2 ఎకరాలు, ఏపీ గ్రామీణ బ్యాంక్‌కు 2 ఎకరాలు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 0.40 ఎకరాలు, ఎస్ఐబీకి 0.50 ఎకరాలు, కిమ్స్‌కు 25 ఎకరాలు, బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్‌కు 0.50 ఎకరాలు, బీజేపీ కార్యాలయానికి 2 ఎకరాలను, బాసిల్ వుడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు 4 ఎకరాలు కేటాయించేందుకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది.
సబ్ కమిటీ నిర్ణయాలకు ఆమోదం
భూముల కేటాయింపులపై కేబినెట్ సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం లభించింది. సీబీఐ, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడెమీ, ఎంఎస్కే ప్రసాద్ క్రికెట్ అకాడెమీ, కిమ్స్ సహా 16 సంస్థలకు 65 ఎకరాల మేర భూ కేటాయింపులకు ఆమోదం ఇచ్చారు. రాజధానిలోని ఈ-15 రహదారిపై 6 లేన్ల ఆర్వోబీ నిర్మాణానికీ సీఆర్డీఏ అథారిటీ ఆమోదం ఇచ్చింది. పొట్టి శ్రీరాములు, అల్లూరి సీతారామరాజు స్మారక చిహ్నాల ఏర్పాటుకు స్థలం కేటాయించేందుకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాజధాని అమరావతికి పరిశ్రమలు రావాలంటే అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి నారాయణ. 2 వేల 500 ఎకరాల్లో స్మార్ట్ పరిశ్రమలు తీసుకువస్తామని చెప్పారు. రాజధాని నిర్మాణ పనులకు ఇసుక కొరత లేకుండా చూసేందుకు ప్రకాశం బ్యారేజీ ఎగువన డీసిల్టేషన్ ప్రక్రియ ద్వారా ఇసుకను తవ్వుకునేందుకు అనుమతి ఇచ్చారు.