TG: రిజర్వేషన్లు రాకముందే టికెట్ల యుద్ధం
నోటిఫికేషన్ ముందే రాజకీయ రచ్చ... తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడి.. పురపాలక పాలనపై కన్నేసిన పార్టీలు.. మున్సిపల్ టికెట్లపై పార్టీల్లో తీవ్ర పోటీ
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ఇంకా అధికారికంగా ప్రకటించకముందే రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రిజర్వేషన్లు ఖరారు కాలేదు, ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువడలేదు. అయినా సరే, ప్రధాన రాజకీయ పార్టీల్లో టికెట్ల కోసం పోటాపోటీ మొదలైంది. మున్సిపల్ పాలనపై పట్టుసాధించడమే లక్ష్యంగా అన్ని పార్టీలు ముందస్తు వ్యూహాలతో కదులుతున్నాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీతో పాటు ప్రతిపక్షాల్లోనూ ఆశావహుల హడావుడి స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిల నివాసాలు రాజకీయ సందడితో కిటకిటలాడుతున్నాయి. టికెట్ ఆశిస్తున్న నాయకులు, వారి అనుచరులు, కుల సంఘాల ప్రతినిధులు, కాలనీ పెద్దలు వరుసగా నేతలను కలుస్తూ తమ అభ్యర్థిత్వానికి మద్దతు కోరుతున్నారు. “టికెట్ ఇస్తే తప్పకుండా గెలిపిస్తాం” అన్న హామీ రాజకీయ నేతల చెవుల్లో మోగుతోంది. ఇది కేవలం వ్యక్తిగత ప్రతిభ లేదా ప్రజాసేవ అనుభవం వరకు మాత్రమే పరిమితం కాకుండా, సామాజిక సమీకరణలు, కుల బలం, స్థానిక లెక్కలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.
రిజర్వేషన్లు ఖరారు కాకముందే వ్యూహాలు
పురపాలక సంఘాల ఎన్నికల్లో కీలకమైన అంశం వార్డు రిజర్వేషన్లు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ రిజర్వేషన్ల ఖరారుపై ఇంకా స్పష్టత రాలేదు. ఎన్నికల సంఘం అధికారిక నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. అయినప్పటికీ, “మనకు అనుకూలమైన రిజర్వేషన్ వచ్చే అవకాశాలు ఎక్కువ” అన్న అంచనాతో అభ్యర్థులు ముందుగానే రంగంలోకి దిగారు. కొందరు అభ్యర్థులు ఏ రిజర్వేషన్ వచ్చినా సరే తమకు కాకపోతే తమ భార్యకు లేదా కుటుంబ సభ్యులకు టికెట్ దక్కేలా ముందస్తు దస్తీ వేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ధోరణి పార్టీల్లో అంతర్గత చర్చలకు, అసంతృప్తులకు కూడా కారణమవుతోంది. మున్సిపల్ చైర్మన్ పదవుల విషయంలోనూ ఇదే పరిస్థితి. గతంలో అమలైన రిజర్వేషన్లే కొనసాగుతాయన్న అంచనాతో చైర్మన్ పదవుల ఆశావహులు ఇప్పటి నుంచే తమ రాజకీయ కసరత్తును వేగవంతం చేశారు. వార్డు స్థాయి నుంచి చైర్మన్ స్థాయి వరకు ఒకేసారి పోటీ తీవ్రంగా ఉండటంతో పార్టీలకు అభ్యర్థుల ఎంపిక సవాల్‌గా మారే అవకాశం కనిపిస్తోంది.
అధికార పార్టీపై ఎక్కువ ఆశలు
అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని స్థానిక సంస్థల స్థాయిలోనూ పునరావృతం చేయాలన్న లక్ష్యంతో ఉంది. ఇదే సమయంలో, అధికార పార్టీ టికెట్ దక్కితే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న భావన ఆశావహుల్లో బలంగా ఉండటంతో, కాంగ్రెస్‌లో పోటీ మరింత తీవ్రంగా మారింది. ఉమ్మడి జిల్లాల పరిధిలోని అనేక మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ టికెట్ల కోసం నాయకుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ముఖ్యంగా మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, లక్షెట్టిపేట, క్యాతన్‌పల్లి, నస్పూర్, ఖానాపూర్ వంటి ప్రాంతాల్లో చైర్మన్ పదవుల కోసం ఆశావహులు విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు స్థానికంగా బలమైన నాయకులు కాగా, మరికొందరు ఇటీవల పార్టీలో చేరిన కొత్త నేతలు. ఈ కలయిక కాంగ్రెస్‌లో అంతర్గత సమతుల్యతను పరీక్షించనుంది.
బీజేపీ కూడా వెనకడుగు వేయకుండా
మరోవైపు భారతీయ జనతా పార్టీ కూడా కొన్ని మున్సిపాలిటీలను లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతోంది. ముఖ్యంగా నిర్మల్, ఆదిలాబాద్, కాగజ్‌నగర్, బైంసా వంటి ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థుల ఆసక్తి ఎక్కువగా కనిపిస్తోంది. ఈ ప్రాంతాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు ఉండటంతో, పార్టీకి అనుకూల వాతావరణం ఉందన్న అంచనా ఆశావహులను ముందుకు నడిపిస్తోంది. స్థానికంగా ఉన్న పార్టీ బలం, కేంద్ర రాజకీయాల ప్రభావం, హిందుత్వ రాజకీయాల అంశాలను ఉపయోగించుకొని మున్సిపల్ స్థాయిలోనూ పట్టుసాధించాలని బీజేపీ భావిస్తోంది. మున్సిపల్ ఎన్నికలు అంటే స్థానిక సమస్యల పరిష్కారం, పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదల వంటి అంశాలు ముందుండాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో టికెట్ల రాజకీయాలు ఈ అంశాలను వెనక్కి నెట్టుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎవరు ఎంతకాలంగా పార్టీలో ఉన్నారు, ఎవరి వెనుక ఎంత బలం ఉంది, ఎవరి కుల సమీకరణలు ఎంత ప్రభావవంతంగా ఉంటాయి. ఇవే ప్రధాన ప్రమాణాలుగా మారుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇది పార్టీలకు కూడా ఒక రకమైన ప్రమాదమే.