Amaravati Farmers Maha Padayatra : అమరావతి రైతుల మహా పాదయాత్ర 3వ రోజు ఉత్సాహంగా..

Amaravati Farmers Maha Padayatra : రైతులకు ఊరువాడ ఘన స్వాగతం పలుకుతుంది. దీంతో జై అమరావతి నినాదాలు మార్మోగుతున్నాయి. అమరావతిపై అధికార పార్టీ పెద్దలు చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొడతామని.. రాజధాని ఆవశ్యకతను రాష్ట్ర ప్రజలకు వివరిస్తామని రైతులు తెలిపారు.

Update: 2022-09-14 07:39 GMT

Amaravathi Padayatra 3rd day: అమరావతి రైతుల మహా పాదయాత్ర 3వ రోజు ఉత్సాహంగా కొనసాగుతుంది. దుగ్గిరాల నుంచి ప్రారంభమైన యాత్ర నందివెలుగు, తెనాలి వరకు సాగనుంది. అక్కడ మధ్యాహ్న భోజనం తర్వాత మళ్లీ యాత్ర ప్రారంభం కానుంది. పెద్దరావురులో రాత్రి బస చేయనున్నారు. ఇవాళ 15 కిలోమీటర్ల మేర రైతులు పాదయాత్ర చేస్తారు.

రైతులకు ఊరువాడ ఘన స్వాగతం పలుకుతుంది. దీంతో జై అమరావతి నినాదాలు మార్మోగుతున్నాయి. అమరావతిపై అధికార పార్టీ పెద్దలు చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొడతామని.. రాజధాని ఆవశ్యకతను రాష్ట్ర ప్రజలకు వివరిస్తామని రైతులు తెలిపారు.

అమరావతి టు అరసవెల్లి మహాపాదయాత్ర జోరుగా సాగుతోంది. 60 రోజుల యాత్ర దిగ్విజయంగా సాగబోతోంది. న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్రకు ప్రజలు ప్రాంతాలకు అతీతంగా బ్రహ్మరథం పట్టారు. అమరావతి టు అరసవెల్లికి కూడా అంతే ప్రజారణ వస్తోంది. ఇదే ఇప్పుడు జగన్ ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది.

అమరావతి టు అరసవెల్లి సక్సెస్ అయితే.. ఇక రాష్ట్రవ్యాప్తంగా అమరావతే ఏకైక రాజధాని అనే నినాదానికి గట్టి బలం, పూర్తి మద్దతు వచ్చినట్టే. అందుకే, కలవరపాటుకు గురవుతున్న అధికారపార్టీ.. ఎలాగైనా విషప్రచారంతో రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయబోతోందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇందులో భాగంగా మళ్లీ మూడు రాజధానుల బిల్లు అంటూ కొత్త నాటకాలను తెరపైకి తెస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తానికి మూడు రాజధానులు అంటూ చిచ్చు పెట్టి.. ప్రాంతాల మధ్య రగిలే మంటలతో చలికాచుకునే ప్రయత్నం జరుగుతోందంటూ చెబుతున్నారు.

ఈ వర్షాకాల సమావేశాల్లోనే అసెంబ్లీలో మరోసారి మూడు రాజధానుల బిల్లు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. మూడు రాజధానుల బిల్లులు ఉపసంహరించుకున్న జగన్.. మళ్లీ సమగ్రమైన బిల్లుతో వస్తామని స్వయంగా ప్రకటించారు. ఈనెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనే మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

నిజానికి అమరావతిని నిర్మించాల్సిందేనని హైకోర్టు విస్పష్టంగా చెప్పింది. మూడు రాజధానులపై ముందుకు వెళ్లాలంటే.. హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసి అనుకూలంగా తీర్పు వచ్చేలా వాదనలు వినిపించుకుంటే తప్ప అసెంబ్లీలో బిల్లు పెట్టడం సాధ్యం కాదు. అందుకే, సుప్రీంలో పిటిషన్ వేసి.. స్టే ఉత్తర్వు తీసుకొచ్చి బిల్లు ప్రవేశపెట్టే ఆలోచన కూడా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు ఏపీ పాలనా రాజధాని త్వరలోనే వైజాగ్‌కు మారుతుందని మంత్రులు చెబుతున్నారు. హైకోర్టు అంత స్పష్టంగా చెప్పిన తరువాత కూడా మంత్రులు ఇలాంటి స్టేట్‌మెంట్‌ ఇవ్వడం.. ప్రజలను రెచ్చగొట్టడమేనంటున్నారు. ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకే మంత్రులు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు.

ఏదేమైనా 2024 అసెంబ్లీ ఎన్నికల లోపు.. మూడు రాజధానుల ప్రక్రియ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్నారు సీఎం జగన్. కాని, ముఖ్యమంత్రికి అర్ధంకాని విషయాలు చాలా ఉన్నాయంటూ చెప్పుకొస్తున్నాయి విపక్షాలు.

మూడు రాజధానుల అంశం కోర్టులతో ముడిపడిన వ్యవహారం కావడంతో ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా, కేంద్రం కూడా సహకరించాల్సి ఉంటుందని గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా కోర్టులో ఎదురుదెబ్బలు తప్పవని చెబుతున్నారు. 

Tags:    

Similar News