454వ రోజుకు చేరిన అమరావతి ఆందోళనలు
జగన్ సర్కార్.. వికేంద్రీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.;
అమరావతి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామంటున్నారు రాజధాని రైతులు. ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చినా సరే.. మూడు రాజధానుల నిర్ణయం వెనక్కు తీసుకునే వరకు వెనక్కు తగ్గేదే లేదని స్పష్టం చేస్తున్నారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి రైతులు, మహిళలు చేపట్టిన ఆందోళనలు నేటికి 454వ రోజుకు చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.
మందడం, తుళ్లూరు, వెలగపూడి, వెంకటపాలెం, ఉద్దండరాయుని పాలెం సహా... రాజధాని గ్రామాలన్నీ ఆందోళనలు తెలుపుతున్నాయి. దీక్షా శిబిరాల్లోనే రైతులు, మహిళలు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. జగన్ సర్కార్... వికేంద్రీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే అమరావతితో పాటు విశాఖ ఉక్కు కోసం గళమెత్తారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామంటున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో రిలే దీక్షలు చేపట్టారు. అమరావతితో పాటు విశాఖ ఉక్కును సాధిస్తామని రైతులు, మహిళలు స్పష్టం చేస్తున్నారు.