AMARAVATHI: రాజధాని గడ్డపై త్రివర్ణ పతాక రెపరెపలు
అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు.. త్రివర్ణ పతాకం ఆవిష్కరించిన గవర్నర్ నజీర్.. హాజరైన చంద్రబాబు, పవన్ కల్యాణ్, అయ్యన్న
అమరావతిలో తొలిసారి గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. జాతీయ పతాకాన్ని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆవిష్కరించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రులు లోకేశ్, అచ్చెన్నాయుడు, నారాయణ, కొల్లు రవీంద్ర హాజరయ్యారు.
గవర్నర్ కీలక వ్యాఖ్యలు
హైకోర్టు సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మైదానంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పరేడ్‌లో పాల్గొన్న 11 దళాల నుంచి గవర్నర్ గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్ర ప్రగతిని చాటేలా 22 శకటాలను ప్రదర్శించారు. గణతంత్ర వేడుకలను చూసేందుకు రాజధాని ప్రాంత రైతులు, విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సవాళ్లను ఎదుర్కొంటూ ప్రభుత్వం ధృఢమైన సంకల్పంతో స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి, విశ్వాసాన్ని తిరిగి నిర్మించడానికి కృషి చేస్తోందని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. నేటి వేడుక చరిత్రాత్మకమన్న ఆయన తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల రాజధాని అమరావతిలో జాతీయజెండా ఎగురవేస్తున్నామన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా మన రాష్ట్రం స్పష్టమైన దిశ లేకుండా నిలిచిపోయిందని చెప్పారు. రాజధాని నిర్మాణం ఆగిపోవడంతో ఆర్థిక విశ్వాసం దెబ్బతిందన్నారు. పాలనలో కొనసాగింపుల లేమి పెట్టుబడిదారుల నమ్మకాన్ని తగ్గించి ఆర్థిక స్థిరత్వాన్ని బలహీనపరిచిందని వ్యాఖ్యానించారు.
రాష్ట్రాన్ని బలపరుస్తూ దాని భవిష్యత్తును సమృద్ధిగా తీర్చిదిద్దుతున్న ప్రతి ఒక్కరితో ఈ శుభక్షణాన్ని పంచుకోవడం గర్వకారణమన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలే ప్రగతికి శిల్పులు అని వ్యాఖ్యానించారు. ఈ ప్రయాణం సులభం కాదన్న గవర్నర్, వీటి ఫలితాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. ప్రాజెక్టులు ముందుకు సాగుతున్నాయని, సంస్థలు తిరిగి బలపడుతున్నాయని, ప్రజల విశ్వాసం మళ్లీ స్థాపితమవుతోందని చెప్పారు. పునరుద్ధరణ మార్పు ప్రయాణం ప్రారంభమైందన్నారు. ఈ దిశను మరింత స్పష్టంగా ముందుకు తీసుకెళ్లేందుకు, ప్రభుత్వం స్వర్ణ ఆంధ్ర-2047 కార్యాచరణను ఒక స్పష్టమైన దృష్టిలో స్థిరపరిచిందని వెల్లడించారు. భారత స్వాతంత్య్ర శతాబ్ది నాటికి, బలమైన, సమగ్ర, ప్రపంచ స్థాయిలో పోటీతత్వం గల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. సాంకేతికత ద్వారా, సహాయం, సమాచారం, న్యాయం పౌరులకు క్షణాల్లో చేరేలా తాము వ్యవస్థను తీర్చిదిద్దుతుని, దీనినే 'వేగవంతమైన పాలన'- స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ అని పిలుస్తున్నట్లు వెల్లడించారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా, ప్రజాస్వామ్యాన్ని మాత్రమే కాదని, ప్రతి సవాలు నుంచి మరింత బలంగా ఎదుగుతున్న ఆంధ్రప్రదేశ్ ఆత్మవిశ్వాసాన్ని కూడా మనం వేడుకగా జరుపుకుంటున్నామని చెప్పారు.