AMBATI: అంబటి రాంబాబు అసభ్య వ్యాఖ్యలు.. భగ్గుమన్న టీడీపీ శ్రేణులు

చంద్రబాబుపై తీవ్ర అసభ్య పదజాలంతో దూషణ.. హద్దు దాటిన అంబటి రాంబాబు వ్యాఖ్యలు.. అంబటి ఇల్లు, ఆఫీసుపై టీడీపీ శ్రేణుల దాడి.. అంబటి రాంబాబును అరెస్ట్ చేసిన పోలీసులు

Update: 2026-02-01 02:45 GMT

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేగింది. మాటల హద్దులు చెరిగిపోయాయి. ప్రజాస్వామ్య మర్యాదలు చితికిపోయాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిపై బహిరంగంగా అసభ్య, అసహ్య పదజాలంతో దూషణలు చేస్తూ మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. అధికారాన్ని కోల్పోయిన తరువాత బూతుల రాజకీయానికి దిగజారడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రగిలించింది. గుంటూరు–అమరావతి రహదారిపై ఏర్పాటు చేసిన ఒక ఫ్లెక్సీ వద్ద జరిగిన ఈ ఘటన, రాజకీయ విమర్శలకు మించిన స్థాయిలో వ్యక్తిగత దూషణలుగా మారింది. ముఖ్యమంత్రిని ఉద్దేశించి అంబటి ఉపయోగించిన భాష వింటే ఏ సాధారణ పౌరుడైనా సిగ్గుతో తలదించుకునే పరిస్థితి. మాటల దాడిలో సంస్కారం లేకుండా, సంయమనం కోల్పోయి, బహిరంగ ప్రదేశంలో బూతులు తిట్టడం రాజకీయ విమర్శగా కాకుండా వ్యక్తిగత విద్వేషంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ప్రతిస్పందన వ్యక్తమైంది. ముఖ్యంగా కూటమి శ్రేణుల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. ఒక మాజీ మంత్రి ఈ స్థాయిలో మాట్లాడతాడా? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి భాషకు చోటుందా? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రిపై ఇష్టానుసారంగా బూతులు తిట్టడం, రాజకీయ సంస్కృతిని దిగజార్చడమేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తీవ్ర ఉద్రిక్తతలు

అంబటి వ్యాఖ్యలపై నిరసనగా గుంటూరు నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆయన నివాసం, కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకోగా, పోలీసులకు పరిస్థితిని అదుపులోకి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆగ్రహించిన కూటమి కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగారు. అనేక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయి. అంబటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్లు ఊపందుకున్నాయి. చివరికి పోలీసులు రంగంలోకి దిగారు. పలు ఫిర్యాదుల ఆధారంగా అంబటి రాంబాబును అరెస్ట్ చేసి గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈ అరెస్ట్ జరగడం రాజకీయంగా మరో మలుపు తీసుకొచ్చింది. ఒకప్పుడు మంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఇప్పుడు అసభ్య వ్యాఖ్యల కారణంగా అరెస్ట్ కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా, అంబటి అరెస్ట్ అనంతరం ఆయన నివాసం వద్ద చోటుచేసుకున్న ఘటనలు మరింత ఉద్రిక్తతకు దారి తీశాయి. ఇంటి వద్ద చిన్నపాటి అగ్ని ప్రమాదం చోటుచేసుకుందని, వెంటనే పోలీసులు మంటలను అదుపులోకి తీసుకున్నారని అధికారులు తెలిపారు. అయితే దీనిపై కూడా రాజకీయ ఆరోపణలు, ప్రతిఆరోపణలు మొదలయ్యాయి. 

ముఖ్యమంత్రిపై అంబటి చేసిన బూతులు. ప్రజాస్వామ్యంలో విమర్శలకు హక్కు ఉంది. కానీ విమర్శల పేరుతో బూతులు తిట్టడం, వ్యక్తిగత దూషణలకు దిగడం అనేది రాజకీయ హక్కు కాదు, అది రాజకీయ పతనం. ఒక నాయకుడి మాటలు లక్షల మందిని ప్రభావితం చేస్తాయి. అలాంటి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి భాష ఉపయోగించడం సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.రాష్ట్ర రాజకీయాల్లో పెరుగుతున్న ఈ వాగ్ధాటులు, అసభ్య వ్యాఖ్యలు ప్రజల్లో విసుగును కలిగిస్తున్నాయి. అభివృద్ధి, సంక్షేమం, పాలనపై చర్చ జరగాల్సిన చోట బూతుల రాజకీయాలు నడుస్తుండటం ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతమని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అంబటి ఘటన కేవలం ఒక వ్యక్తికి సంబంధించినది కాదు; ఇది మొత్తం రాజకీయ వ్యవస్థ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సందర్భంగా మారింది.

Tags:    

Similar News