BJP: అవినీతికి పాల్పడలేదని చెప్పే ధైర్యముందా రేవంత్
కాంగ్రెస్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆగ్రహం.... బీఆర్‌ఎస్, కాంగ్రెస్, మజ్లిస్‌లది ఒకే ఎజెండా అని మండిపాటు..;
తెలంగాణలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్, మజ్లిస్.. ఒకే ఎజెండాతో నడుస్తున్నాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మూడు పార్టీలు.. పని చేస్తున్నాయన్న ఆయన కాంగ్రెస్ , బీఆర్‌ఎస్ లక్షల కోట్ల కుంభకోణాలు చేశాయని విమర్శించారు. అవినీతి, కుటంబ పాలన సాగించే పార్టీలతో.. దేశం, రాష్ట్రాభివృద్ధి సాధ్యం కాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ అవినీతికి పాల్పడలేదని చెప్పే ధైర్యం.. రేవంత్ రెడ్డికి ఉందా అని సవాలు విసిరారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బీజేపీ పోలింగ్ కేంద్రం స్థాయి అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనంలో పాల్గొన్న కేంద్రమంత్రి...లోక్‌సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా దిశానిర్దేశం చేశారు. కేంద్రంలో ఈసారి 400 సీట్లు రావాలన్న అమిత్ షా... తెలంగాణలో 12 స్థానాల్ని కైవసం చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, మజ్లిస్ పార్టీలు ఒక్కటేనన్న అమిత్‌షా... మజ్లిస్ అజెండాతోనే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పనిచేస్తాయని ఆరోపించారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండు అవినీతి పార్టీలేనని అమిత్‌షా ధ్వజమెత్తారు. 2 జీ, బోఫోర్స్ కుంభకోణం సహా దేశంలో కాంగ్రెస్ చేయని అవినీతి లేదని ఆరోపించారు. కాంగ్రెస్ చేసిన కుంభకోణాల జాబితా పంపిస్తా అవినీతి జరిగిందా లేదో రేవంత్ చెప్పాలంటూ సవాల్ విసిరారు. బీఆర్‌ఎస్ సర్కారు.. కాళేశ్వరం సహా లిక్కర్ కుంభకోణానికి పాల్పడిందన్నారు. మోడీ పాలనలో దేశం సురక్షంగా ఉందని.. శరణార్థుల కోసం CAA ను తీసుకువస్తే కాంగ్రెస్, బీఆర్‌ఎస్, MIM వ్యతిరేకిస్తున్నాయంటూ.. అమిత్‌షా దుయ్యబట్టారు.
ఎల్బీస్టేడియంలో సమావేశం అనంతరం అమిత్ షా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం... బేగంపేట ఐటీసీ కాకతీయ హోటల్ లో భాజపా ముఖ్యనేతలు, పార్లమెంట్ కన్వీనర్స్, జాతీయ కార్యవర్గ సభ్యులతో సమావేశమై లోక్ సభ ఎన్నికల ప్రచార వ్యూహాలు, సభలు సమావేశాలు, నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై ఆరా తీశారు. నేతల మధ్య విభేదాలు పక్కన పెట్టి.. సమన్వయంతో పని చేయాలని మార్గ నిర్దేశనం చేశారు.