Pawan Kalyan: అమిత్ షాను టాగ్ చేస్తూ పవన్ సంచలన ట్వీట్..
గత ప్రభుత్వం రాష్ట్రాన్ని గంజాయి, డ్రగ్స్‌కు అడ్డాగా మార్చిందని ఆరోపణ;
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను టాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని గంజాయి, డ్రగ్స్‌కు అడ్డాగా మార్చిందని ఆరోపించారు. ఇదే ఇప్పుడు రాష్ట్రానికి పెనుముప్పుగా పరిణమించిందని ట్వీట్ చేశారు. కేంద్ర హోంశాఖ స్పందించి డ్రగ్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
"రాష్ట్రంలో డ్రగ్స్ పెనుముప్పుగా మారింది. మునుపటి అవినీతి, నేర పాలన నుండి సంక్రమించిన మరొక వారసత్వ సమస్య. రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా, గంజాయి సాగు, సంబంధిత నేర కార్యకలాపాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించాలి. కొంతకాలం క్రితం విశాఖపట్నంలో సీజ్ చేసిన డ్రగ్స్ లింకులు విజయవాడలోని ఒక వ్యాపార సంస్థలో తేలాయి. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. గత పాలనలో డ్రగ్ మాఫియా బాగా అభివృద్ధి చెందింది. నేరగాళ్లను కట్టడి చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలి. దీనికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అవసరం" అని జనసేనాని ట్వీట్ చేశారు.
విశాఖపట్నం షిప్‌మెంట్ కేసును సమగ్ర దర్యాప్తు కోసం సీబీఐకి అప్పగించాలని పవన్ డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్టులు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యవహారంలో చాలా మంది జైలుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు విశాఖ కంటైనర్ వ్యవహారంపై దర్యాప్తు మొదలు పెడితే రాష్ట్రంలో మరో రాజకీయ దుమారం రేగే అవకాశాలు కనిపిస్తున్నాయి.