LOKESH: త్వరలో రెడ్‌బుక్‌ మూడో చాప్టర్‌

మంత్రి నారా లోకేశ్ అట్లాంటా వేదికగా సంచలన వ్యాఖ్యలు... జగన్ ను లోపల వేయడానికి రెండు నిముషాలు చాలన్న లోకేశ్;

Update: 2024-11-01 02:15 GMT

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం పోయిన తర్వాత ఏపీ ప్రజలు ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారని మంత్రి నారా లోకేష్ అన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ అట్లాంటాలో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. జగన్ గురించి మాట్లాడటానికి ఏమీ లేదని, ప్రజలే కుర్చీ మడతపెట్టారని లోకేశ్ అన్నారు. ఫలితాలు వచ్చినప్పుడు కాస్త భయమేసిందని, ఈ స్థాయిలో వస్తుందని తాము ఊహించలేదని లోకేశ్ అన్నారు. సీఎం బాబు అనుకుంటే.. జగన్ ను లోపల వేయడానికి రెండు నిముషాలు చాలని నారా లోకేశ్ అన్నారు.

ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక ఆస్తితోపాటు ఉద్యోగాల్లో మహిళలకు అవకాశం ఇచ్చారన్నారు. కానీ మాజీ సీఎం జగన్.. ఆస్తుల విషయంలో తల్లి, చెల్లిని రోడ్డు కీడ్చారంటూ విమర్శలు గుర్పించారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్పినా ఆయనలో ఇంకా మార్పు రాలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆవేదన లేదా? ఎలాంటి తప్పు చేయని వ్యక్తి 52 రోజులు జైలులో ఉన్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం కావాల్సింది రివేంజ్ కాదని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడమే ఆయన లక్ష్యమన్నారు. యువతకు ఉపాధి కల్పించాలన్నారు. ప్రజలు తమపై బాధ్యత పెట్టారని, వారి ఆశలు వమ్ము చేయమన్నారు. పెట్టుబడులు రప్పించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. కచ్చితంగా రెడ్ బుక్‌ని అమలు చేస్తామని చెప్పకనే చెప్పేశారు మంత్రి లోకేష్. ఈ క్రమంలో లెజెండ్‌ మూవీలో బాలకృష్ణ డైలాగ్‌ని గుర్తు చేశారు. తెలుగు జాతి ఉన్నంత కాలం చరిత్ర పుటల్లో ఎన్టీఆర్ పేరు శాశ్వతంగా ఉంటుందన్నారు

రెడ్‌బుక్‌ మూడో చాప్టర్‌

అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేశ్ అట్లాంటా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రెడ్‌బుక్‌లో రెండు చాప్టర్లు ఓపెన్‌ అయ్యాయని, త్వరలోనే మూడో చాప్టర్‌ తెరుస్తామన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి కచ్చితంగా సినిమా చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. రెడ్‌బుక్‌కు భయపడుతున్న వైఎస్ జగన్‌.. గుడ్‌బుక్‌ తీసుకొస్తామంటున్నారని, కానీ బుక్‌లో ఏమి రాయాలో ఆయనకు అర్థం కావట్లేదని ఎద్దేవా చేశారు.

జగన్ కు ఆస్కార్ ఇవ్వొచ్చన్న మంత్రి

అబద్ధాల్లో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని..మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. పోలవరం ఎత్తుపై తప్పుడు ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. పోలవరంపై జగన్ చేసిన విమర్శలకు మంత్రి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కన్నతల్లిని తోడబుట్టిన చెల్లిని మోసం చేసి జగన్ ఛీత్కారానికి గురయ్యారని సెటైర్లు వేశారు. ప్రపంచ చరిత్ర తిరగేస్తే తల్లిని, చెల్లిని మోసం చేసిన దౌర్భాగ్య రాజకీయవేత్త జగనే అని మండిపడ్డారు.

Tags:    

Similar News