Kadapa Floods: కళ్లెదుటే వరదల్లో కొట్టుకుపోయిన భర్త.. కంటతడి పెట్టిస్తున్న ఆయేషా వ్యథ..

Kadapa Floods: కడప జిల్లాను ముంచెత్తిన వరదలు.. ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపాయి.

Update: 2021-11-25 09:22 GMT

Kadapa Floods: కడప జిల్లాను ముంచెత్తిన వరదలు.. ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపాయి. ఇప్పటికీ, తమ వారి జాడ తెలియక వీధుల్లో తిరుగుతున్నారు. అలాంటి ఓ ఇల్లాలి దీనగాథే ఇది. వారం రోజులైనా ఇంటాయన ఎక్కడున్నాడో తెలియకపోవడంతో... చెట్టూ పుట్టా వెతుకుతోంది ఆయేషా. కనిపించిన అధికారినల్లా అడుగుతోంది. తన భర్త రషీద్‌ ఎక్కడైనా కనిపిస్తే చెప్పండంటూ చుట్టుపక్కల వారందరినీ వేడుకుంటోంది. రాజంపేట మండలం గుండ్లూరుకు చెందిన ఆయేషా వ్యథ అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఆదుకుంటాం, అండగా ఉంటామంటూ అధికార పార్టీ వాళ్లు వస్తున్నారే తప్ప.. ఇప్పటి వరకు తన భర్త జాడను కనుక్కునేందుకు ఎవరూ ప్రయత్నించలేదని వాపోతోంది. పోలీసులకు ఫోన్ చేస్తే.. నెంబర్లన్నీ స్విచాఫ్‌ వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తోంది.

ఈనెల 19న అన్నమయ్య ప్రాజెక్ట్‌ కట్ట తెగడంతో చెయ్యేరు నది ఒక్కసారిగా ఊళ్ల మీదకి దూసుకొచ్చింది. గుండ్లూరు, పులపుత్తూరు, మందపల్లె, తోగూరుపేట గ్రామాలను ముంచేసింది. గుండ్లూరుకు చెందిన రషీద్‌ బంధువులు చూస్తుండగానే వరదలో కొట్టుకుపోయారు. అప్పటి నుంచి రషీద్‌ భార్య ఆయేషా ఊళ్లన్నీ తిరిగింది. రషీద్‌ మృతదేహం కనిపించిందని ఎవరో చెప్పడంతో.. ఒక్కసారిగా గుండెలు జారిపోయాయి. కన్నబిడ్డలను వెంటపెట్టుకుని, బోరున విలపిస్తూ వెళ్లి చూసింది. అది తన భర్త మృతదేహం కాకపోవడంతో ఊపిరిపీల్చుకుంది. మరి, తన కళ్ల ముందే కొట్టుకుపోయిన భర్త ఏమయ్యాడనేదే అంతుచిక్కకుండా ఉంది. ఏ ఒక్క ప్రభుత్వ అధికారి తన ఆక్రందనను ఆలకించకపోవడంతో.. ఆక్రోశంతోనే ప్రభుత్వంపై ఆగ్రహం వెళ్లగక్కింది. జగన్‌.. ఇప్పుడు ఎక్కడున్నావ్ అంటూ ప్రశ్నిస్తోంది.

రషీద్‌ ప్రాణాలతోనే ఉండి ఉంటాడన్న ఆశతో ఉంది ఆయేషా. అంతలోనే.. ఒకవేళ బతికే ఉంటే ఈపాటికి ఇంటికి చేరేవాడే కదా అనే ఓ చిన్న సందిగ్ధం. దీంతో ఫలానా చోట శవాలను తీస్తున్నారు.. వెళ్లి నీ భర్త శవం ఉందేమో చూసుకోమని చుట్టుపక్కల వాళ్లు చెబుతుండడంతో.. బాధను దిగమింగుకుని మరీ వెళ్తోంది. ఆయేషా దీనస్థితి చూసి ప్రతి ఒక్కరూ చలించిపోతున్నారు.

Similar News