CBN: తిరుమల ఏ మతస్థులు ఎవరైనా రావచ్చు
కాకపోతే డిక్లరేషన్ తప్పక ఇవ్వాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారం, దేవాలయాల పరిరక్షణ, మత సంబంధిత నిబంధనలు వంటి అంశాలపై ఆంధ్రప్రదేశ్ రాజకీయ వేదికపై మళ్లీ వేడెక్కిన చర్చ సాగుతోంది. శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల వంటి పవిత్ర క్షేత్రానికి అన్ని మతాల వారు రావచ్చని, అయితే అన్యమతస్థులు శ్రీవారి దర్శనానికి వస్తే తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ నిబంధనను గత ప్రభుత్వం పూర్తిగా ఉల్లంఘించిందని ఆయన మండిపడ్డారు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో రాష్ట్రవ్యాప్తంగా అనేక దేవాలయాలపై దాడులు జరిగాయని గుర్తుచేసిన చంద్రబాబు, ఈ తరహా చర్యలు దివంగత వైఎస్సార్ హయాంలోనే ప్రారంభమయ్యాయని ఆరోపించారు. తిరుమల శ్రీవారిని ‘ఏడుకొండలు’ కాకుండా ‘రెండు కొండలు’ మాత్రమే అని పేర్కొంటూ అప్పట్లో జారీ చేసిన జీవోపై రెండు సంవత్సరాల పాటు ఆందోళనలు నిర్వహించామని, చివరకు ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చిందని తెలిపారు. శ్రీవారిపై అపచారం చేస్తే ఈ జన్మలోనే శిక్ష అనుభవించాల్సి వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
పద్మావతి యూనివర్సిటీకి క్రిస్టియన్ వ్యక్తిని వైస్ చాన్సలర్‌గా నియమించారని, ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా కూడా తాము పోరాటం చేశామని చంద్రబాబు చెప్పారు. చరిత్రను ఎవరూ మార్చలేరని, జరిగిన విషయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు. అలాగే వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్‌గా ఉన్నప్పుడు బైబిల్ పట్టుకుని తిరిగేవారని విమర్శించారు. మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కుమార్తె వివాహం క్రిస్టియన్ సంప్రదాయంలో జరిగిందని కూడా ప్రస్తావించారు. ఇక లడ్డూ నెయ్యి సరఫరా అంశంపై కూడా సీఎం స్పష్టత ఇచ్చారు. ఇందాపూర్ డెయిరీకి హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. తిరుమల లడ్డూ తయారీకి ఇందాపూర్ డెయిరీ నెయ్యి సరఫరా చేసిందని, ఆ సంస్థకు హెరిటేజ్ సంబంధం ఉందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో అసెంబ్లీలో క్లారిటీ ఇచ్చారు. ఇందాపూర్ డెయిరీ అనేక సంస్థలకు కో-మ్యానుఫాక్చరింగ్ చేస్తుందని తెలిపారు. హెరిటేజ్ సంస్థ ఎప్పుడూ తప్పుడు పనులకు పాల్పడదని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. తప్పు చేసి మళ్లీ తమల్నే క్షమాపణలు చెప్పాలని అడుగుతున్నారని విమర్శించారు. తాను బతికున్నంతకాలం వెంకటేశ్వరస్వామికి ఎలాంటి అపచారం జరగనివ్వనని హామీ ఇచ్చారు. రాజకీయాల్లో కొన్ని నియమాలు పెట్టుకున్నానని, ఏ దేవాలయానికీ పాలు లేదా నెయ్యి సరఫరా చేయొద్దని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. భక్తుల విశ్వాసాన్ని కాపాడటం తమ ప్రభుత్వ ధ్యేయమని మరోసారి స్పష్టం చేశారు.