AP: నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ
ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్ నజీర్.... స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం;
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం సభ వాయిదా పడుతుంది. తర్వాత అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడి అధ్యక్షతన శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేసంలో ఈసారి శాసనసభ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి.... ఏయే అంశాలపై చర్చించాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటారు. ఈనెల 26 వరకు అంటే, ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. గవర్నర్ ప్రసంగంపై రేపు(మంగళవారం) చర్చ జరగనుంది. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేస్తూ ఉపసంహరణ బిల్లును కూడా రేపే శాసనసభలో ప్రవేశ పెట్టనున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు, ఎక్సైజ్ విధానం, రాష్ట్ర అప్పులు-ఆర్థిక స్థితికి సంబంధించి శ్వేతపత్రాలను విడుదల చేయనుంది. వీటిపై సభ్యులు చర్చించే అవకాశముంది.
శాసనసభ సమావేశాలకు సందర్శకులను అనుమతించరాదని నిర్ణయించారు. విధులకు హాజరయ్యే అధికారులు, సిబ్బందికి మాత్రమే పాస్‌లు ఇవ్వనున్నారు. కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుల ప్రమాణ స్వీకార సమయంలో సందర్శకులు పెద్దఎత్తున రావడంతో గ్యాలరీలు కిక్కిరిశాయి. గందరగోళ పరిస్థితుల కారణంగా సభ్యులకూ ఇబ్బంది కలిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత సమావేశాలకు సందర్శకులను వెంట తీసుకురావద్దని ఎమ్మెల్యేలకు సూచించినట్లు సమాచారం. ఇక, శాసనసభ మీడియా పాయింట్‌ను ఐదేళ్ల తర్వాత పునరుద్ధరించారు.
అసెంబ్లీ సమావేశాలకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ శాసనసభాపక్షం రాజధాని వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించనుంది. అనంతరం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి హాజరుకానున్నారు. వీరంతా పసుపు రంగు దుస్తులు, కండువా ధరించనున్నారు. తొలిరోజు సమావేశాలు ముగిశాక మధ్యాహ్నం 2.30 గంటలకు అసెంబ్లీలోని కమిటీ నంబర్ హాలు-1లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది.