CBN: మహిళల కష్టాలు తీర్చేందుకే పథకాలు

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన... ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభంలో సీఎం కీలక వ్యాఖ్యలు;

Update: 2024-11-02 03:00 GMT

ఆంధ్రప్రదేశ్‌లో ఏ కార్యక్రమాన్నై నా అక్కచెల్లెమ్మలను దృష్టిలో పెట్టుకునే టీడీపీ ప్రభుత్వం చేపడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మహిళలకు రాజకీయాల్లోనూ, ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్లు కల్పించిన ఘనత టీడీపీకే దక్కుతుందని వెల్లడించారు. మహిళల వంటింటి కష్టాలు తీర్చడం కోసం ఉచిత గ్యాస్‌ సిలిండర్లను కూటమి ప్రభుత్వం అందిస్తోందని చంద్రబాబు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గం ఈదుపురంలో నిర్వహించిన దీపం-2 ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరిగింది. చంద్రబాబు ఈదుపురం గ్రామంలో దీపం పథకం లబ్ధిదారుల ఇంటికి వెళ్లి స్వయంగా ఉచిత గ్యాస్‌ సిలిండరును అందించారు. గ్యాస్‌ వెలిగించి టీ పెట్టి ఇంటి కుటుంబసభ్యులతోపాటు సరదాగా ఆస్వాదించారు. మహిళా లబ్ధిదారు ఇంటికి వెళ్లి ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ అందజేశారు. అనంతరం స్వయంగా స్టవ్‌ వెలిగించి టీ చేసి తాగారు. కాగా సాయంత్రం జిల్లా అధికారులతో సమీక్ష జరుపుతారు. రాత్రికి శ్రీకాకుళంలోనే చంద్రబాబు బస చేయనున్నారు. మొన్నటి ఎన్నికలలో నరకాసుర వధ జరిగిందని చంద్రబాబు అన్నారు. చెడుపై మంచి గెలిచిందన్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి అన్ని సీట్లు గెలవలేదన్నారు. " ఏం తమ్ముళ్లూ....దీపావళి బాగా చేసారా..? జ్ఞాపకం ఉందా దీపావళి ఎందుకు చేస్తున్నాం..? నరకాసురుడ్ని వధించినప్పుడు దీపావళి చేసుకుంటున్నాం. మొన్నటి ఎన్నికల్లో నరకాసురుడ్ని వధ చేశాం. చెడు మీద మంచి గెలిచిన రోజు. మొన్నటి ఎన్నికల్లో ఇక్కడుండే నరకాసురుడ్ని ఓడించాం.” అని చంద్రాబాబు అన్నారు.


రాజకీయ కక్ష సాధింపులకు పోను: సీఎం చంద్రబాబు

బాధ్యతగల ప్రజాప్రతినిధిని.. తప్పు చేసిన వారిని వదిపెట్టను, రాజకీయ కక్షసాధింపులకు పోనని సీఎం చంద్రబాబు అన్నారు. లీడర్ అంటే ప్రజల మనస్సుల్లో అభిమానం ఉండాలని, సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తిని సీఎం అన్నారు. మొన్నటి ఎన్నికల్లో కూటమి కార్యకర్తలు రాజీలేని పోరాటం చేశారని ఆయన అన్నారు. తన మీటింగ్‌లో ఆర్భాటాలు ఉండవని... బలవంతంగా జనాలను తీసుకురాబోమని... చెట్లను తొలగించబోమని చంద్రబాబు అన్నారు. కొత్తగా మొక్కలను నాటుతామని వెల్లడించారు. ఏ రాజకీయ నాయకుడైనా ప్రజాసేవకుడిగా ఉండాలని... కానీ, గడిచిన ఐదేళ్ల సంగతి వేరన్నారు.

ఇసుకపై అన్ని ట్యాక్సులు రద్దు చేశాం: చంద్రబాబు

ఉచిత ఇసుక విధానంలో నేతల జోక్యంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇసుకపై అన్ని ట్యాక్సులు రద్దు చేశామని, ఎవరైనా అడ్డొస్తే ఫోన్ చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. ఇసుక పాలసీపై ఎవరైనా జోక్యం చేసుకుంటే పీడీ యాక్ట్ పెడతామన్నారు. రాష్ట్రంలో ఇకపై కల్తీ మద్యం ఉండదని, బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. విశాఖపట్నంను ఆర్థికంగా అభివృద్ధి చేస్తామని, అమరావతిని బాగు చేస్తామని చంద్రబాబు తెలిపారు.

Tags:    

Similar News