AP: ఏపీకి కొనసాగుతున్న భారీ పెట్టుబడులు
1.87 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టనునన ఎన్టీపీసీ.. కీలక ముందడుగుగా అభివర్ణించిన చంద్రబాబు;
ఏపీలో మరో సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. రాష్ట్రంలో పునరుత్పాదక రంగంలో ప్రాజెక్టులు పెట్టేందుకు ఎన్టీపీసీ సిద్ధమైంది. ఈ మేరకు రూ.1.87 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు కూటమి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా వచ్చే 25 ఏళ్లలో రాష్ట్రానికి రూ.20,620 కోట్ల ఆదాయం రానుంది. దాదాపు 1.06 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ మేరకు NGEL - NREDCAP మధ్య సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేశ్, గొట్టిపాటి రవి సమక్షంలో ఒప్పందం చేసుకున్నారు. ఎన్టీపీసీ రెన్యుబుల్ సెక్టార్లో ఏపీ ప్రభుత్వ భాగస్వామ్యంతో కలిసి ఎన్టీపీసీ పెట్టుబడులు పెట్టనుంది. ఈ సెక్టార్లో ప్రాజెక్టులు పెట్టేందుకు రూ.1,87,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంది. ఈ పెట్టుబడుల ద్వారా రానున్న 25 ఏళ్లలో రాష్ట్రానికి 20,620 కోట్ల ఆదాయం రానుందని.. లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయని అధికారులు తెలిపారు. ఈ మేరకు ఎన్జీఈఎల్- ఎన్ఆర్ఈడీసీఏపీ మధ్య సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం జరిగింది.
లక్ష్యాలు ఇవే...
ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ, ఎన్టీఈఎల్ భాగస్వామ్యంతో 25 గిగావాట్ల సామర్థ్యమున్న సౌర, పవన, హైబ్రిడ్ విధానాల ఇంధన ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని ఎన్టీపీసీ లక్ష్యంగా పెట్టుకుంది. 0.5 ఎంఎంటీపీఏ గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయనుంది. దీనికి అదనంగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో 10 గిగావాట్ల సామర్థ్యంతో పంప్డ్ హైడ్రో ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తుంది. ఈ ఒప్పంద కార్యక్రమంలో ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎన్టీపీసీ గ్రీన్ సీఎండీ గురుదీప్‌సింగ్, ఎన్టీఈఎల్ ఈడీ ఆర్.సారంగపాణి, ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ పాల్గొన్నారు.
కీలక ముందడుగు
ఈ జాయింట్ వెంచర్ ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలిపేందుకు కీలక అడుగు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. సౌర, పవన, పంప్డ్ స్టోరేజీ, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా వంటి పునరుత్పాదక విద్యుత్ రంగ ప్రాజెక్టులను ప్రోత్సహించడానికి ఏపీ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. భవిష్యత్ అంతా పునరుత్పాదక విద్యుత్ రంగానిదేనని ఆయన వెల్లడించారు. ఈ ప్రాజెక్టు మొదటి దశను 2027 ఏప్రిల్-మే నాటికి పూర్తి చేయ్యాలని సీఎం తెలిపారు. పర్యావరణానికి హాని కలిగించని ఇంధన వనరుల ఉత్పత్తికి కృషి చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వ సహకారం ఎప్పుడూ ఉంటుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.