CASE: వల్లభనేని వంశీపై మరో కేసు
మర్లపాలెంలో అక్రమంగా మట్టి తవ్వకాలు... స్థానికుడి ఫిర్యాదుతో కేసు నమోదు;
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకు ఉచ్చు మరింత బిగుస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వంశీ చేసిన అరాచకరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మిన్నకుండిపోయిన బాధితులందరూ బయటకు వచ్చి కేసులు పెడుతున్నారు. ఇప్పటికే గన్నవరం నియోజకవర్గంలోని పలు స్టేషన్లలో మూడు కేసులు నమోదు కాగా.. తాజాగా మరో కేసు పెట్టారు. గన్నవరం శివారు మర్లపాలెంలో 18 ఎకరాల పానకాల చెరువును 15 మంది గ్రామస్థులు 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నారు. 2023లో వల్లభనేని వంశీ, తన అనుచరులతో కలిసి భూములను ఖాళీ చేయాలని రైతులపై ఒత్తిడి చేసి దౌర్జన్యానికి పాల్పడ్డారు. భూమిని స్వాధీనం చేసుకొని.. నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా మట్టి తవ్వకాలు జరిపి అమ్ముకున్నారు. దీనిపై మర్లపాలెం గ్రామస్థుడు జాస్తి మురళీకృష్ణ గన్నవరం పోలీసులను ఆశ్రయించారు. దీంతో వంశీ సహా పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
నేటితో ముగియనున్న వల్లభనేని వంశీ కస్టడీ
వల్లభనేని వంశీ పోలీస్ కస్టడీ నేటి(గురువారం)తో ముగియనుంది. నిన్న వంశీని కృష్ణలంక పోలీసులు టెక్నికల్ ఆధారాలను చూపించి దాదాపు 20 ప్రశ్నలు అడిగారు. సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపుల కోణంలో ప్రశ్నించారు. తెలియదు, సంబంధం లేదని వంశీ సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. విచారణ తర్వాత మరోసారి పరీక్షల నిమిత్తం వంశీని GGHకు తీసుకెళ్లి వైద్య పరీక్షల అనంతరం జైలుకు తరలించారు.
రెండో రోజూ విచారణ
వల్లభనేని వంశీ రెండో రోజు విచారణ ముగిసింది. దాదాపు 5 గంటల పాటు పోలీసులు ఆయనను విచారించారు. కాగా.. సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరించిన వ్యవహారంలో పదిరోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, మూడు రోజుల పాటు వంశీని విచారించేందుకు కోర్టు అనుమతించింది. నిన్నటి (మంగళవారం) నుంచి వంశీ విచారణ ప్రారంభమవగా, నేటితో ముగియనుంది.