AP: బోరుగడ్డకు మరో ఎదురుదెబ్బ
బీజేపీ నేత సత్యకుమార్‌పై దాడిపై హత్యాయత్నం కేసు నమోదు.. మరో మహిళ ఫిర్యాదుపైనా కేసు;
వైసీపీ ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా జుగుప్సాకరమైన వ్యాఖ్యలు, దూషణలు, బెదిరింపులతో రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ రెచ్చిపోయాడు. ఆయన ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నాడు. తాజాగా అనిల్ పై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. గత ఏడాది మార్చి 31వ తేదీన బీజేపీ నేత సత్యకుమార్‌పై దాడి చేశారు. మరో మహిళ కుడా అనిల్ పై ఫిర్యాదు చేశారు. అనంతపురం ఫోర్త్ టౌన్ పోలీసులు కస్టడీకి ఇవాళ తీసుకున్నారు. రాజమండ్రి నుంచి అనంతపురం తీసుకువెళ్లేందుకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు అనంతపురం పోలీసులు చేరుకున్నారు. నగరంలోని ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద బోరుగడ్డ అనిల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మూడు రోజులు పాటు బోరుగడ్డ అనిల్‌ను పోలీసుల కస్టడీకి కోర్టు అనుమతించింది. కోర్టు అనుమతి మేరకు అనిల్‌ను రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అనంతపురం తీసుకువెళ్లనున్నారు.
సత్యకుమార్ పై దాడి
బీజేపీ నేత సత్యకుమార్‌పై దాడి కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్ ఏ1గా, బోరుగడ్డ అనిల్ ఏ2 ఉన్నారు. రాజధాని రైతులకు సంఘీభావం తెలిపి వస్తుండగా సత్యకుమార్‌పై వైసీపీ శ్రేణులు దాడి చేశాయి. ఆ దాడిలో కొందరు బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు. సురేష్, అనిల్‌తో సహా 25 మందిని నిందితులుగా ఈ కేసులో చేర్చారు. రాజమండ్రి జైలులో ఉన్న అనిల్‌పై కేసు నమోదు చేశారు. కస్టడీకి తీసుకుని, వైద్య పరీక్షల కోసం జీజీహెచ్ ఆస్పత్రికి అనిల్‌ను తరలించారు. అరండల్ పేట పోలీసులు మూడురోజుల పాటు అనిల్‌ను ప్రశ్నించారు.వెలగపూడిలో జరిగిన మహిళ హత్య కేసులో నందిగం సురేష్ గుంటూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. డబ్బుల కోసం బెదిరించిన కేసులో బోరుగడ్డ అనిల్ రాజమండ్రి జైలులో ఉన్నారు. దాంతోపాటు ఏపీ సీఎం చంద్రబాబును దూషించిన కేసు కూడా అనిల్ మీద ఉంది.
ఏఈఎల్‌సీ చర్చి వివాదం కేసులో..
ఏఈఎల్‌సీ చర్చి వివాదం కేసులో అనిల్‌ను పోలీసులు గుంటూరు కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించింది. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని మేజిస్ట్రేట్ ఆదేశాలు ఇచ్చారు. కాగా, ఈ కేసును విచారిస్తున్న పోలీసుల వద్ద అనిల్ కన్నీరు మున్నీరైనట్లు తెలిసింది. విశ్వాసనీయ వర్గాల సమాచారం ప్రకారం, పోలీసు అధికారులు ఏది అడిగినా అనిల్ దాచుకోకుండా సమాధానమిచ్చారు. ‘‘నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చగొట్టేలా మాట్లాడారు. దానికితోడు వైసీపీ నాయకులు.. నన్ను ముందుకు నెట్టి వారు వెనుక ఉన్నారు. నాటి మంత్రి మోపిదేవి వెంకటరమణ, ఆయన సోదరుడితో పాటు గుంటూరు నగర వైసీపీ అధ్యక్షుడు అప్పిరెడ్డి ఆదేశానుసారమే నాటి విపక్ష నేతలను దూషించాను. బెదిరింపులకు పాల్పడ్డాను’’ అని అనిల్ కుమార్ పోలీసుల విచారణలో తెలిపారు.