AP: మరో రెండు గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాలు
కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం.... శ్రీకాకుళం, అమరావతిలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌లు;
ఆంధ్రప్రదేశ్‌లో విమానయాన మౌలిక సదుపాయాల విస్తరణకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి, శ్రీకాకుళం జిల్లాల్లో గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాలపై సాంకేతిక, ఆర్థిక అధ్యయన నివేదికలు సిద్ధం చేయడానికి కన్సల్టెంట్ల నియామకానికి ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (APADC) టెండర్లు పిలిచింది. ఏపీలో రెండు గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్మాణానికి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. వాటిలో ఒకటి రాజధాని అమరావతిలో.. మరొకటి శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటుచేయాలని సంకల్పించింది. వీటికి సంబంధించి ప్రీ-ఫీజిబిలిటీని పరిశీలించేందుకు.. సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాల నివేదిక రూపొందించేందుకు కన్సల్టెంట్ల నియామకానికి ఏపీఏడీసీ టెండర్లు పిలిచింది. ఆన్‌లైన్‌లో టెండర్ల దాఖలుకు ఈ నెల 21 వరకు గడువు ఇచ్చింది. ఈ నెల 24న సాంకేతిక బిడ్‌లు, 27న ఫైనాన్షియల్ బిడ్‌లు తెరవనుంది. అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు ఏ ప్రాంతం అనుకూలమో కూడా కన్సల్టెన్సీ సంస్థే సూచించాలని నిబంధనల్లో పేర్కొంది.
శ్రీకాకుళంలో ఎక్కడ ఎయిర్‌పోర్ట్?
శ్రీకాకుళం జిల్లాలో నిర్మించబోయే విమానాశ్రయాన్ని ఈశాన్య దిశలో, శ్రీకాకుళం నగరానికి 70 కి.మీ. దూరంలో, సముద్రతీరానికి సమీపంలో నిర్మించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. గతంలోనూ కేంద్ర బృందం సభ్యులు మందస, వజ్రపుకొత్తూరు మండలాల్లో భూములను పరిశీలించారు. కన్సల్టెన్సీ సంస్థలు ప్రతిపాదిత విమానాశ్రయాల నిర్మాణం, నిర్వహణను ప్రభావితం చేసే సాంకేతిక, ఆర్థిక అంశాలను గుర్తించాలి. పర్యావరణ మరియు సామాజిక ప్రభావ అధ్యయనాలు నిర్వహించాల్సిన బాధ్యత కూడా వాటిదే.
తొలగనున్న విమానయాన అంతరాలు
ఈ రెండు ఎయిర్‌పోర్ట్‌లు పూర్తయితే ఆంధ్రప్రదేశ్‌లో విమానయాన సేవలు మరింత విస్తరించి, వాణిజ్య, పరిశ్రమలకు పెరుగుదల తథ్యం. ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణ అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే రాష్ట్రానికి అంతర్జాతీయ విమానయాన రంగంలో ప్రముఖస్థానం దక్కే అవకాశం ఉంది.