AMARAVATHI: అమరావతిలో మరో అద్భుతం
‘నామీ ద్వీపం సీఈవో మిన్ క్యోంగో వూతో మంత్రి నారాయణ భేటీ
అమరావతిలో మరో అద్భుతం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. సహజ సిద్ధమైన సాంస్కృతిక, సాంప్రదాయ పర్యాటక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం పేరుగాంచిన ‘నామీ ఐలాండ్’ను సందర్శించాలని భావించారు. ఈ మేరకు ఏపీ మంత్రుల బృందం దక్షిణ కొరియాలోని సియోల్‌కు వెళ్లింది. తాజాగా ‘నామీ ద్వీపం సీఈవో మిన్ క్యోంగో వూతో మంత్రి నారాయణ భేటీ అయ్యారు. నామీ ఐలాండ్, పర్యాటకులను ఆకట్టుకునే చర్యలపై ఆయనను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 4,60,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అందమైన చెట్లు, పూల మొక్కలతో నామీ ద్వీపం ఏర్పాటు చేసినట్లు సీఈవో మిన్ క్యోంగో వూ తెలిపారు. బ్లూ గ్రీన్ సిటీగా అమరావతిని తీర్చిదిద్దేందుకు నామీ ఐలాండ్ విధానాలను అనుసరిస్తామని మిన్ క్యోంగో వూకు మంత్రి నారాయణ వివరించారు. సియోల్‌లో ఏర్పాటు చేసిన ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో నామీ ఐలాండ్ ఒకటి. ఈ ఐలాండ్ లో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ తో పాటు ఏడాది మొత్తం సంగీత ఉత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఇప్పటికీ ఆకర్షిస్తోంది. దీంతో ఇలాంటి ఐలాండ్‌ను కూడా అమరావతిలో ఏర్పాటు చేసి ప్రపంచ దృష్టికి ఆర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం మొదలు పెట్టింది.