ఆంధ్రప్రదేశ్లో చిన్నారుల కోసం కొత్తగా 15 న్యూట్రిషియన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని ముఖ్యమైన 15 ప్రభుత్వాసుపత్రుల్లో త్వరలో 'న్యూట్రిషన్ రిహాబిలిటేషన్ సెంటర్స్' (ఎస్ఆర్సీ) ఏర్పాటు చేయనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ కేంద్రాల ద్వారా ఐదేళ్లలోపు వయస్సు కలిగిన చిన్నారులకు సేవలందుతాయన్నారు. వీటిల్లో 11 గిరిజన ప్రాంతాల్లో వస్తాయని పేర్కొన్నారు. వీటన్నిటిలో కలిపి 115 పడకలు చిన్నారులకు అందుబాటులోకి రానున్నాయని, ప్రస్తుతం రాష్ట్రంలో 21 ఎస్ఆర్సీలు ఉండగా... వీటిల్లో 340 పడకలు ఉన్నాయని తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు ఏరియా ఆసుపత్రి, ముంచింగిపట్టు, చింతపల్లి సీహెచ్సీలో వచ్చే న్యూట్రిషియన్ సెంటర్లలో 10 చొప్పున పడకలు ఉండనున్నాయి. నరసరావుపేట ఏరియా ఆసుపత్రి, నంద్యాల జిల్లా నంద్యాల బోధనాసుపత్రి, సున్నిపెంట ఏరియా ఆసుపత్రిలో వచ్చే కేంద్రాల్లో 10 చొప్పున పడకలు ఏర్పాటు చేయనున్నారు. ఈ ఆసుపత్రిలో ప్రత్యేకంగా వార్డులు ఏర్పాటు చేశారు.