AP: కల్తీ నెయ్యిపై ఏకసభ్య కమిషన్ నియామకం

కూటమి సర్కార్ సంచలన నిర్ణయం.. సమగ్ర విచారణ జరిపేందుకు కమిషన్.. రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ నేతృత్వం

Update: 2026-02-20 14:03 GMT

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ అంశంపై రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంపై సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సమర్పించిన నివేదికలో ప్రస్తావించిన ఆరోపణలను సమగ్రంగా పరిశీలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకే సభ్యుడితో కూడిన విచారణ కమిషన్‌ను నియమించింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ అధ్యక్షతన ఈ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. దినేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన 1983 బ్యాచ్ సీనియర్ ఐఏఎస్ అధికారి. ఆయన గతంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పరిపాలనలో విశేష అనుభవాన్ని సొంతం చేసుకున్నారు. పౌర సరఫరాలు, ఆహార శాఖ వంటి కీలక విభాగాల్లో బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఆయనకు ఉంది. నిజాయితీ, పారదర్శకతకు కట్టుబడి పనిచేసిన అధికారి అనే పేరును ఆయన సంపాదించారు. పదవీ విరమణ అనంతరం కూడా ప్రభుత్వం అప్పగించే కీలక బాధ్యతలను నిర్వర్తిస్తూ ప్రజా వ్యవస్థలో తన పాత్రను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుమల లడ్డూ నెయ్యి కొనుగోలు వ్యవహారంపై విచారణ బాధ్యతను ప్రభుత్వం ఆయనకు అప్పగించింది.

ఈ ఏకసభ్య కమిషన్ ప్రధానంగా 2019 నుంచి 2024 మధ్యకాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం కోసం నెయ్యి సేకరణ, టెండర్ ప్రక్రియ, నాణ్యత ప్రమాణాల అమలు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించనుంది. సిట్ నివేదికలో ప్రస్తావించిన లోపాలను విశ్లేషించి, వాటి వెనుక ఉన్న పరిపాలనాపరమైన తప్పిదాలు ఏమిటి? నిబంధనలు ఎలా ఉల్లంఘించబడ్డాయి? అనే కోణాల్లో లోతైన అధ్యయనం చేయనుంది. ముఖ్యంగా నెయ్యి నాణ్యత విషయంలో నిబంధనలు ఉద్దేశపూర్వకంగా సడలించబడాయా? టెండర్ అర్హత ప్రమాణాలను ఎవరికి అనుకూలంగా మార్చారు? వంటి ప్రశ్నలకు సమాధానాలు కనుగొనే దిశగా విచారణ కొనసాగుతుంది. అదే విధంగా, బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న కంపెనీలకు కాంట్రాక్టులు ఎలా లభించాయి? ఈ ప్రక్రియలో అధికారుల పాత్ర ఎంత వరకు ఉంది? ఎవరైనా ఉన్నతాధికారులు లేదా రాజకీయ ప్రేరణతో నిర్ణయాలు తీసుకున్నారా? వంటి అంశాలను కూడా కమిషన్ పరిశీలించనుంది. కేవలం పత్రాల పరిశీలనతో పరిమితం కాకుండా, అవసరమైతే సంబంధిత అధికారులను, టెండర్ ప్రక్రియలో భాగమైన వ్యక్తులను విచారణకు పిలిచి వివరణలు కోరే అవకాశం ఉంది.

ప్రభుత్వం ఈ కమిషన్‌కు 45 రోజుల గడువు విధించింది. నిర్ణీత కాలవ్యవధిలోగా నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. లడ్డూ ప్రసాదం పవిత్రతకు భంగం కలిగించే విధంగా జరిగిన అవకతవకలు ఉన్నాయా? ఉంటే వాటికి బాధ్యులెవరు? అనే దానిపై స్పష్టమైన నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. అవసరమైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా సిఫారసులు చేయాలని కూడా సూచించింది. సిట్ ఇప్పటికే దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను ఆధారంగా తీసుకుని, పరిపాలనాపరమైన మరియు విధానపరమైన కోణాల్లో మరింత లోతుగా విశ్లేషణ చేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా, ఈ కమిషన్ నియామకంపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకే అంశంపై సిట్ ఇప్పటికే దర్యాప్తు నిర్వహిస్తుండగా, సమాంతరంగా మరో విచారణ కమిషన్‌ను నియమించడం చట్టవిరుద్ధమని వైసీపీ నేతలు వాదిస్తున్నారు. వారి అభిప్రాయం ప్రకారం, ఒక కేసులో క్రిమినల్ దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో మరో అధికారిక కమిషన్ ఏర్పాటు చేయడం విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉందని అంటున్నారు.

అయితే టీడీపీ వర్గాలు మాత్రం దీనిని ఖండిస్తున్నాయి. కమిషన్ ఆఫ్ ఇన్‌క్వైరీ యాక్ట్, 1952 ప్రకారం ప్రభుత్వానికి ప్రత్యేక అవకతవకలు లేదా పరిపాలనాపరమైన లోపాలపై విచారణ జరిపించేందుకు కమిషన్‌ను నియమించే పూర్తి అధికారం ఉందని వారు స్పష్టం చేస్తున్నారు. సిట్ అనేది క్రిమినల్ కోణంలో నేర బాధ్యతలను నిర్ధారించే దిశగా దర్యాప్తు చేస్తే, ఏకసభ్య కమిషన్ విధానపరమైన నిర్ణయాలు, టెండర్ నిబంధనల ఉల్లంఘనలు, వ్యవస్థాగత లోపాలు వంటి అంశాలపై దృష్టి సారిస్తుందని పేర్కొంటున్నారు. రెండు విచారణల పరిధులు వేర్వేరుగా ఉన్నంత వరకు చట్టపరమైన ఇబ్బంది ఉండదని వారు చెబుతున్నారు.

Tags:    

Similar News