AP: ఏపీ శాసనసభ నిరవధిక వాయిదా
మొత్తం 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం.. అరవై గంటల పాటు కొనసాగిన సభ;
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు నిరవధిక వేయిస్తున్నట్లు ప్రకటించారు. 10 రోజులపాటు కొనసాగిన సభలో మొత్తం 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం లభించింది. మొత్తం 59 గంటల 57 నిమిషాల పాటు సభ కొనసాగింది. కాగా.. 75 ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇచ్చారు. చివరి రోజు 3 బిల్లులకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. మరోవైపు.. శాసన మండలి కూడా నిరవధిక వాయిదా పడింది. కాగా.. ఈ రెండు సభలు ఈ నెల 11న ప్రారంభమయ్యాయి. సీఎం చంద్రబాబు నాయుడితోపాటు మంత్రులు ఎనిమిది ప్రకటనలు చేశారని చెప్పారు. సభలో వివిధ అంశాలపై 120 మంది సభ్యులు ప్రసంగించారని పేర్కొన్నారు. ఈ సభలో రెండు లఘు చర్చలతో పాటు, మూడు ప్రభుత్వ తీర్మానాలను ఆమోదించారని గుర్తు చేశారు. ఈ సమావేశాల్లోనే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరిగిందన్నారు. అదే విధంగా మూడు కమిటీలకు ఎన్నిక సైతం జరిగిందని పేర్కొన్నారు.
పీఏసీ కమిటీ సభ్యులుగా..
ఈ సందర్భంగా వివిధ కమిటీలలో ఎన్నికైన సభ్యుల పేర్లను ఈ సందర్భంగా స్పీకర్ ప్రకటించారు. పీఏసీ కమిటీ విజేతలుగా.. నక్కా ఆనందబాబు, అరిమిల్లి రాధాకృష్ణ, అశోక్ రెడ్డి, రామంజనేయులు, జయనాగేశ్వరరెడ్డి, కోళ్ల లలిత కుమారి, శ్రీరాంతాతయ్య, పులపర్తి రామాంజనేయులు, విష్ణుకుమార్ రాజు ఎంపికయ్యారు.
అంచనాల కమిటీకి..
అలాగే అంచనాల కమిటికీ భూమా అఖిల ప్రియ, బండారు సత్యానందం, వాల్మీకి పార్ధసారథి, ఏలూరి సాంబశివరావు, నిమ్మక జయకృష్ణ, కందుల నారాయణ రెడ్డి, సుధీర్ కుమార్లను... అలాగే ప్రభుత్వ రంగ సంస్ధల కమిటీ విజేతలుగా అయితాబత్తుల ఆనందరావు, ఈశ్వరరావు, సత్యనారాయణ, గౌతు శిరీష్, కూన రవికుమార్, వర్ల కుమార్ రాజా, తెనాలి శ్రవణ్ కుమార్, వసంత కృష్ణ ప్రసాద్, రంగారావు ఎంపికయ్యారు. అదే విధంగా విశాఖ డెయిరీ అక్రమాలపై ప్రత్యేక సభా సంఘం వేయాలని అసెంబ్లీ నిర్ణయించిందన్నారు.
బహిష్కరించిన వైసీపీ
ఈ అసెంబ్లీ సమావేశాలను వైసీపీ బహిష్కరించింది. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు సమావేశాలకు హాజరుకాలేమని చెప్పారు. కేవలం శాసన మండలికి మాత్రం వైసీపీ ఎమ్మెల్సీలు హాజరయ్యారు. టీడీపీ, వైసీపీ సభ్యుల ప్రశ్నలు సమాధానాలతో శాసనమండలి 10 రోజుల పాటు దద్దరిల్లింది. ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ టీడీపీ మంత్రుల మధ్యలు మాటలయుద్ధం సాగింది.