AP: నేడు ఏపీ అసెంబ్లీ ముందుకు కీలక బిల్లులు
సభ ముందుకు ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు బిల్లు... వైద్యారోగ్య వర్సిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణ బిల్లు;
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు శాసనసభలో రెండు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు బిల్లు, వైద్యారోగ్య వర్సిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణ బిల్లును సభ ముందు ఉంచనుంది. అలాగే గవర్నర్ ప్రసంగంపై మంత్రి కాలవ శ్రీనివాసులు ధన్యవాదాల తీర్మానం ప్రవేశపెట్టనుండగా.. దీనిపై సభలో సభ్యులు ప్రసంగించనున్నారు. నిన్న ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసగించారు . గత ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన నష్టం అంచనాకు కూడా అందని స్థాయిలో ఉందని, రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ కూడా కష్టంగా మారిందని జస్టిస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలవడం, బాధ్యతలు స్వీకరించడం సంతోషకరమే.. కానీ రాష్ట్రం ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో.. గెలిచిన సభ్యులూ సంతోషించే స్థితిలో లేరని గవర్నర్ అన్నారు. ప్రజల ఆకాంక్షలను తక్షణం తీర్చే మార్గమూ దొరకడం లేదన్నారు. దేశంలోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామని... వీటన్నింటి నేపథ్యంలో అర్థవంతమైన చర్చల తర్వాతే.. పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు.
గత ప్రభుత్వ దుష్పరిపాలన, ఐదేళ్లలో వ్యవస్థల విధ్వంసం, విపరీతమైన అవినీతికి సంబంధించిన వాస్తవాల్ని ప్రజల ముందు ఉంచాలనే ఒత్తిడి కూటమి ప్రభుత్వంపై ఉందని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. అందులో భాగంగానే నిధుల వినియోగంలో అంతరాలు, దుర్వినియోగం మూలంగా రాష్ట్ర ఖజానాకు వాటిల్లిన నష్టం, సహజ వనరుల దోపిడీ తదితర అంశాలను వివరిస్తూ సర్కారు శ్వేతపత్రాలు విడుదల చేసిందన్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును కాంక్షిస్తూ.. ప్రజాహిత ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు 5 కోట్ల మంది ప్రజలు చూపిన సంకల్పాన్ని అభినందించాల్సిన అవసరం ఉందన్నారు.
పోలీస్‌కు జగన్ వార్నింగ్
ఆంధ్రప్రదేశ్ శాసనసభ తొలి రోజు సమావేశాల్లోనే తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీ ద్వారం వద్ద విధుల్లో ఉన్న ఒక పోలీసు ఇన్‌స్పెక్టర్‌కు వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. మెడలో నలుపురంగు కండువాలు, చేతిలో ప్లకార్డులతో అసెంబ్లీలోకి ప్రవేశం లేదని.. వాటిని బయట వదిలేసి వెళ్లాలని ఆపినందుకు మధుసూధన్ అనే అధికారిపై జగన్ మండిపడ్డారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి ఇలా పేపర్లను లాక్కుని చింపే అధికారం మీకు ఎవరు ఇచ్చారని మధుసూదన్‌రావ్ గుర్తుపెట్టుకో.. ఎల్లకాలం ఈ మాదిరిగా ఉండదని హెచ్చరించారు. మీ టోపీ మీదున్న సింహాలకు అర్థమేంటో తెలుసా? అధికారంలో ఉన్నవాళ్లకు సెల్యూట్ కొట్టడం కాదని జగన్ హెచ్చరించారు.