AP: ఆంధ్రప్రదేశ్‌లో బీపీసీఎల్ రూ.లక్ష కోట్ల పెట్టుబడులు
అమరావతికి పెట్టుబడుల క్యూ
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్‌లో రూ. లక్ష కోట్ల భారీ పెట్టుబడితో గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయనుంది. నెల్లూరు జిల్లాలోని రామాయపట్నం పోర్టు సమీపంలో దాదాపు 6,000 ఎకరాల విస్తీర్ణంలో ఈ మెగా ప్రాజెక్టును నెలకొల్పనున్నారు. బీపీసీఎల్ ప్రతినిధులు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ రిఫైనరీ సామర్థ్యం ఏటా 9-12 మిలియన్ మెట్రిక్ టన్నుల మధ్య ఉంటుంది. ఇది దేశంలోనే అతిపెద్ద పెట్రోకెమికల్ యూనిట్లలో ఒకటిగా నిలుస్తుంది. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ, కీలక అనుమతులు ఇప్పటికే లభించాయి. వాణిజ్య కార్యకలాపాలు జనవరి 2029 నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో భారీ పారిశ్రామిక అభివృద్ధి జరగడమే కాకుండా, పెట్రోకెమికల్ రంగంలో ఆత్మనిర్భర్ భారత్‌కు కూడా ఇది ఎంతో బలాన్ని చేకూర్చనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అల్ట్రా-మెగా పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక, ఇంధన రంగాల వృద్ధికి పెద్ద ముందడుగు కానుంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో వేలాది మందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
కీలక ముందడుగు
ఏపీలోని రామాయపట్నం సమీపాన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) తలపెట్టిన గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ/పెట్రోకెమికల్ కాంప్లెక్స్ నిర్మాణం దిశగా మరో ముందడుగు పడింది. దీని స్థాపనలో పరస్పర సహకార అవకాశాలను అన్వేషించేందుకు బీపీసీఎల్ ఆయిల్ ఇండియా లిమిటెడ్ (ఓఐఎల్)తో అవగాహనా ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. హైదరాబాద్‌లో జరుగుతున్న 28వ ఎనర్జీ టెక్నాలజీ మీట్-2025లో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. రూ.లక్ష కోట్ల ప్రాథమిక అంచనా వ్యయంతో.. ఏటా 9-12 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతోగ్రీన్ఫీల్డ్ రిఫైనరీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ను నిర్మించనున్నారు.