AP: 12 అట్టపెట్టెల్లో రూ.11 కోట్ల నోట్ల కట్టలు
ఏపీ మద్యం కుంభకోణంలో సంచలనం... హైదరాబాద్‌లో సిట్ సోదాలు... రాజ్ కెసిరెడ్డి ఫామ్ హౌస్‌లో తనిఖీలు... 12 అట్ట పెట్టెల్లో రూ.11 కోట్లు సీజ్;
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం కుంభకోణం కేసు ఊహించని మలుపు తిరిగింది. సిట్ అధికారులు రంగంలోకి దిగి నిందితుల ఇళ్లల్లో సోదాలు చేయగా, హైదరాబాద్ శివారులో రాజ్ కెసిరెడ్డికి సంబంధించిన రూ.11 కోట్ల నగదు పట్టుబడింది. ఈ డబ్బును ఒక గెస్ట్ హౌస్‌లో దాచిపెట్టారు. ఈ వ్యవహారం వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో సిట్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది.
కొత్త కోణం
వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహించి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. రాజ్ కెసిరెడ్డి సూచన మేరకు 12 బాక్సుల్లో భద్రపరిచిన రూ.11కోట్ల నగదును అధికారులు సీజ్ చేశారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలోని సులోచన ఫార్మ్ గెస్ట్ హౌస్‌లో అక్రమ మద్యం నగదు డంప్‌ను అధికారులు గుర్తించారు. లిక్కర్‌స్కామ్‌లో ఏ-40 వరుణ్ పురుషోత్తం నోట సంచలన నిజాలు బయటికొచ్చాయి. అతని వాంగ్మూలం ఆధారంగా తనిఖీలు చేపట్టిన అధికారులకు భారీగా నగదు పట్టుబడింది. నగదు సీజ్ ఘటనలో చాణక్య, వినయ్ పాత్రపైనా సిట్ బృందం విచారణ చేపట్టింది. కట్టల కొద్ది డబ్బుల్ని చూసి అధికారులు షాకయ్యారు. ఈ డబ్బులు స్వాధీనం చేసుకున్న ఘటనలో చాణక్య, వినయ్ పాత్ర ఏంటి అనే అంశంపై కూడా సిట్ ఆరా తీస్తోంది.
పెద్దలు బయటపడే అవకాశం
రాజ్ కెసిరెడ్డి, చాణక్య ఆదేశాల మేరకు జూన్ 2024లో వినయ్ సాయంతో వరుణ్ రూ.11 కోట్ల నగదు ఉన్న 12 అట్ట పెట్టెలను ఆఫీస్ ఫైళ్ల పేరుతో దాచినట్లు సిట్ అధికారులు గర్తించారు. వరుణ్ పురుషోత్తం నేరాన్ని అంగీకరించి నిజాలు బయటపెట్టడంతో లిక్కర్ స్కామ్‌కి చెందిన భారీ నగదు నిల్వల విషయం వెలుగులోకి వచ్చింది. ఏపీ లిక్కర్ స్కామ్‌లో దాదాపు రూ.3500 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లు సిట్ ప్రాథమికంగా గుర్తించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ముఖ్య నేతల పాత్రపై కూడా సిట్‌కు కీలక సమాచారం లభ్యమైనట్లు తెలుస్తోంది. పూర్తి ఆధారాలతో త్వరలో కొందరు పెద్దతలకాయల పాత్ర కూడా బయటపడే అవకాశముందని సమాచారం. ఈ స్కామ్‌లో మరికొందరి పాత్ర కూడా ఉందని సిట్ భావిస్తోందట. పూర్తి ఆధారాలతో త్వరలోనే మరికొన్ని అరెస్ట్‌లు ఉంటాయా అనే చర్చ జరుగుతోంది. ఈ మధ్య కుంభకోణం కేసులో ఇప్పటికే పలువుర్ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.