AP: సభకు వచ్చే ధైర్యం లేకే ఢిల్లీలో ఆందోళనలు
హంతకులు ప్లకార్డులతో అసెంబ్లీలోకి వస్తారా... చంద్రబాబు తీవ్ర ఆగ్రహం;
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీ నేతల ఆందోళనలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్ల పాలనలో ప్రజాస్వామ్యాన్ని అన్నివిధాలా ఖూనీ చేసిన వ్యక్తులు.. ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ ప్లకార్డులతో అసెంబ్లీకి రావడమేంటని నిలదీశారు. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి, మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన వ్యక్తి కూడా ప్లకార్డు ప్రదర్శించారని మండిపడ్డారు. వినుకొండలో జగన్ పార్టీలోని ఇద్దరు వ్యక్తుల మధ్య కక్షల వల్ల ఒకరి హత్య జరిగితే, దానికి రాజకీయ రంగు పులుముతున్నారని విమర్శించారు. సభకు వచ్చే ధైర్యం లేక, ఢిల్లీలో నిరసనలు చేస్తామంటున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఆంధ్రప్రదేశ్‌లో 36 రాజకీయ హత్యలు జరిగాయంటూ దుష్ప్రచారం చేస్తున్న జగన్.. హతుల పేర్లు ప్రకటించాలని అడిగితే మాత్రం సమాధానమివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నకు తొందర్లోనే జవాబు వస్తుందన్నారు. వివేకా హత్య తర్వాత ఘటనా స్థలానికి వెళ్లిన సీఐని ప్రలోభపెట్టి అధికారంలోకి వచ్చాక ఆయనకు డీఎస్పీగా పదోన్నతి కల్పించారని గుర్తు చేశారు. తిరిగి ఆయనతోనే సీబీఐపై ఆరోపణలు చేయించారన్నారు. నిందితుడిని అరెస్టు చేయడానికి కర్నూలుకు వెళ్లిన సీబీఐ వెనక్కి తగ్గాల్సిన పరిస్థితులు కల్పించారు. వివేకా గుండెపోటుతో మృతి చెందారంటూ సాక్షిలో స్క్రోలింగ్ వేశారని గుర్తు చేశారు. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న తానే ఉదయాన్నే అది చూసి అయ్యో పాపం అనుకున్నానని... ఆ తర్వాత ‘నారాసుర రక్తచరిత్ర’ అంటూ దుష్ప్రచారం చేశారని గుర్తు చేశారు. నేరస్థుడు ముఖ్యమంత్రి అయితే, పోలీసులు ఆ నేరగాడికి వంతపాడితే ఎలా ఉంటుందో వైసీపీ పాలనలో చూశామన్నారు. కోడికత్తి డ్రామా తరహాలోనే ఈ ఎన్నికల్లో గులకరాయి డ్రామా పండించాలనుకున్నా ప్రజలు నమ్మలేదని చంద్రబాబు అన్నారు.
వైపీపీ ఐదేళ్ల పాలన ఏపీ చరిత్రలో చీకటి రోజులని చంద్రబాబు అన్నారు. ప్రస్తుత సభాపతి అయ్యన్నపాత్రుడిపై ఏకంగా అత్యాచారయత్నం కేసు పెట్టి, అరెస్టు చేశారు. నారాయణను అదుపులోకి తీసుకుని ఎక్కడెక్కడో తిప్పారు. రఘురామకృష్ణరాజును అరెస్టు చేసినప్పుడు ఆ రాత్రంతా నాకు నిద్రలేదు. ఆయన్ను కాపాడుకోవటానికి ఎంతో ప్రయత్నించానని. వైసీపీ అకృత్యాలపై కక్ష సాధింపులకు పాల్పడితే రాష్ట్రం రావణకాష్ఠమవుతుందన్నారు. తప్పు చేసిన వారిని చట్టప్రకారం శిక్షిస్తామని చంద్రబాబు తేల్చి చెప్పారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ప్రతీకారం తీర్చుకుంటామంటే కుదరదని తెలిపారు. రాజకీయం ముసుగులో నేరాలు చేసేవారిని ఉపేక్షించబోమని... రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల అప్పులున్నాయన్నారు. వాటికి కిస్తీలు, వడ్డీలు కడుతూనే రాష్ట్ర అభివృద్ధి చేయాలని తెలిపారు.