AP: తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం బంపర్ ఆఫర్
ఒక్కరు వద్దు.. ముగ్గురు ముద్దు అంటున్న ప్రభుత్వాలు... ముగ్గురు కంటే ఆస్తి పన్ను మినహాయింపు... ఐవీఎఫ్ చేయించుకున్న వారికి ఖర్చులు భరిస్తాం;
జనాభా పరంగా రెండో స్థానంలో భారత్ గతేడాది చైనాను అధిగమించి మెుదటి స్థానంలో నిలిచింది. ఇతర దేశాలతో పోలిస్తే జనాభా పరంగా మెుదటిస్థానంలో ఉన్నప్పటికీ.. అభివృద్ది పరంగా వెనకబడింది. అయితే జనాభా పరంగా ప్రథమ స్థానంలో ఉన్నప్పటికీ.. ఇంకా జనాభా పెంచే యోచనలో ఇండియాలోని పలు రాష్ట్రాలు యోచిస్తున్నాయి. జనాభా పరంగా ఉత్తరాది కంటే దక్షిణాది రాష్ట్రాలు వెనకబడి ఉండటం ప్రధాన కారణం. దీంతో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఉత్తర్ప్రదేశ్, బిహార్ వంటి రాష్ట్రాలు ఎక్కువ పార్లమెంటు సీట్లు దక్కించుకుంటే.. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాలు సీట్లను నష్టపోయే అవకాశాలున్నాయి. అందువల్లే జనాభాను పెంచేందుకు ప్రభుత్వాలు ప్రోత్సహాలను అందిస్తూ వివిధ రాయితీలు ఇచ్చే ఆలోచనలు చేస్తున్నాయి. తాజాగా ఏపీ ప్రభుత్వం ఒక్కరు వద్దు ముగ్గురు ముద్దు సూత్రానికి ఒకే చెబుతోంది. ఒకప్పుడు జనాభా నియంత్రణ చేయాలని చెప్పిన ఏపీ సీఎం చంద్రబాబే జనాభా పెంచాలని ప్రోత్సహిస్తున్నారు. అంతేకాకుండా ముగ్గురు, నలుగురు పిల్లలను కంటే తగిన రాయితీలు, బహుమతులు ఇస్తామని నూతన జంటలకు చెబుతున్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా త్వరలో ఇలాంటి నిర్ణయాన్ని అమలు చేయబోతోందనే వార్తలు వస్తున్నాయి. జనాభా పెరుగుదలే అభివృద్ధిలో ఇప్పుడు కీలకంగా మారనుంది.
వారే నిజమైన దేశభక్తులు: సీఎం
ఎక్కువ మంది పిల్లలను కన్నవారే నిజమైన దేశభక్తులు అని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ మాటలకు అనుగుణంగా ప్రభుత్వం అడుగులు వేస్తూ జనాభాను పెంచేందుకు ప్రతిపాదనలతో పాలసీనీ సిద్దం చేస్తోంది. ఇందులో ఒకప్పుడు పిల్లలు ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనర్హులని చెప్పిన అంశాన్ని వెనక్కి తీసుకుని ఇద్దరి కంటే ఎక్కువ ఉన్నా పోటీ చేసేందుకు అర్హులను చేయనున్నారు. అంతేకాకుండా ఐవీఎఫ్ చికిత్స ఖర్చును భరించినున్నారు. అంతేకాకుండా ముగ్గురు లేదా నలుగురు పిల్లలు కలిగిన వారికి ఆస్తి పన్ను మినహాయించాలని చూస్తతున్నారు. మూడో బిడ్డను కన్న తల్లులకు ప్రోత్సాహకంగా రూ. 50 వేల చొప్పున ఇవ్వాలని నాలుగో బిడ్డకూ ఈ విధానాన్ని కొనసాగించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల్లో పని చేసే తల్లులకు వర్క్ ఫ్రం హోం సౌకర్యాన్ని కల్పించేందుకు సిద్ధమవుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో పని చేసే ఉద్యోగినులకు మాతృత్వ సెలవులను 6 నుంచి 12 నెలలకు పెంచాలని యోచిస్తున్నారు. వివిధ ఆఫీసుల్లో పని చేసే తల్లులకు అనుకూలంగా ఉండేందుకు పిల్లల కోసం 'క్రెచ్'లు పెట్టాలని పిల్లల సంరక్షణకు సంబంధించి ట్రైనింగ్ కార్యక్రమాలను స్కిల్ డెవలప్మెంట్ ద్వారా చేపట్టాలని, ట్రైనింగ్ పొందిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉపాధి కల్పించాలని ప్రభుత్వం చూస్తోంది.